PPF, సుకన్య సమృద్ధి యోజన పెట్టుబడిదారులకు షాకింగ్ న్యూస్..!

Small Savings Schemes: దేశంలోని ప్రజలు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ లో తమ డబ్బును పొదుపు చేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. దీనికి కారణం వాటిలో స్థిరమైన, సురక్షితమైన ఆదాయాలే. మిగిలిన సాధనాలతో పోల్చినప్పుడు రాబడి కొంత తక్కువగానే ఉన్నప్పటికీ వీటి నుంచి ఖచ్చితమైన రాబడులు ప్రభుత్వ హామీతో కలిగి ఉండటం చాలా మందిని వీటివైపు మళ్లిస్తున్నాయి.


తాజాగా వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2025 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికాలకు సంబంధించిన కాలానికి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని ప్రకటించింది. దీనికి ముందు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి వడ్డీ రేట్లలో పెంపు ఉంటుందనే ఊహాగానాలు భారీగా వినిపించటంతో అనేక మంది పెట్టుబడిదారులు ప్రకటన కోసం ఇన్నాళ్లు ఆసక్తిగా ఎదురుచూశాయి. ఈ క్రమంలో కేంద్రం తిరిగి మెుండి చేయి చూపటంతో చాలా చిన్న పొదుపు పథకాల ఇన్వెస్టర్లు నిరాశ చెందుతున్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు జూలై 1, 2024 నుంచి ప్రారంభమై 30 సెప్టెంబర్, 2024తో ముగిసే కాలానికి ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతాయని పేర్కొంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) కొన్ని ప్రసిద్ధ స్మాల్ సేవింగ్ స్కీమ్స్.

ప్రస్తుతం వివిధ పథకాల వడ్డీ రేట్లు:
– సేవింగ్స్ డిపాజిట్ 4.0%
– ఒక-సంవత్సర కాల డిపాజిట్ 6.9%
– రెండు-సంవత్సరాల కాల డిపాజిట్ 7.0%
– మూడేళ్ల కాల డిపాజిట్ 7.1%
– ఐదు సంవత్సరాల కాల డిపాజిట్ 7.5%
– ఐదు సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ 6.7%
– సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.2%
– నెలవారీ ఆదాయ ఖాతా 7.4%
– నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ 7.7%
– పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 7.1%
– కిసాన్ వికాస్ పత్ర 7.5% (115 నెలలు)
– సుకన్య సమృద్ధి ఖాతా పథకం 8.2%

పన్ను ప్రయోజనాలు..
పైన ఉన్న వాటిలో కొన్ని స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను తగ్గించుకోవటంలో దోహదపడతాయి. ఆదాయపుపన్ను చట్టంలోని సెక్షన్ 80C సింద పన్ను ప్రయోజనాలను అందించే స్కీమ్స్ సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉన్నాయి. ఇదే క్రమంలో కిసాన్ వికాస్ పత్ర (KVP), పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు (5 సంవత్సరాల పదవీకాలం మినహా), పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఇన్కమ్ స్కీమ్, మహిళా సమన్ సేవింగ్స్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లు పథకాలు ఇన్వెస్టర్లకు ఎలాంటి పన్ను ప్రయోజననాలను అందించవు.