ఆంధ్రప్రదేశ్‌లో 829 మంది ప్రధానోపాధ్యాయులకు విద్యా శాఖ అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
కడప జిల్లాలో 829 మంది ప్రధానోపాధ్యాయులకు డీఈవో మీనాక్షి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వీటిని జారీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల అపార్ నమోదును నిర్దేశిత గడువులోగా పూర్తిచేయలేదని జిల్లా విద్యాధికారి ఈ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు సాంకేతిక సమస్యకు తాము ఎలా బాధ్యులం అవుతామని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
షోకాజ్ నోటీసులపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. ప్రధానోపాధ్యయులకు నోటీసులు జారీ చేయడం దుర్మార్గమని విమర్శిస్తున్నాయి. యూటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు విమర్శలు చేశారు. ఆపార్ కింద ఇప్పటికే దాదాపు 80 శాతం వివరాలను నమోదు చేశారని, సాంకేతిక కారణాలతో మరో 20 శాతం పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. కిందస్థాయిలో సమస్యలు తెలుసుకోకుండా నోటీసులు జారీ చేయడం ఏంటనీ ప్రశ్నించారు.
829 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీచేయడం తగదని, వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. డీఈవోని కలిసి ఎస్‌టీయూ నేతలు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌టీయూ నేతలు సురేష్ బాబు, రమణారెడ్డి, ఇలియాస్ బాషా మాట్లాడుతూ.. 80 శాతం అపార్ నమోదు పూర్తి చేసినప్పటికీ, ఇటువంటి చర్యలకు పాల్పడటం విద్యా శాఖ లక్ష్యానికి విఘాతం కలుగుతుందని అన్నారు. అధికారులు సున్నితంగా లక్ష్యసాధన దిశగా పని చేయించుకోవాలని వ్యాఖ్యానించారు.
విద్యార్థుల అపార్ నమోదులో ఉపాధ్యాయులకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించకుండా డీఈవో షోకాజ్ నోటీసులు ఇవ్వడంత దారుణమని ఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రధానోపాధ్యాయులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని, లేదంటే డీఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని పీఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి, ఉపాధ్యాక్షుడు రామాంజనేయరెడ్డి హెచ్చరించారు. డీఈవో మీనాక్షి చర్యలపై టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఈవోపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.