Singapore: సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తి మృతి.. వాటర్‌ ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఘటన!

www.mannamweb.com


Singapore: సింగపూర్‌లోని నేషనల్‌ వాటర్‌ ఏజెన్సీలో విష వాయువులు పీల్చి భారత సంతతికి చెందిన వ్యక్తి మృతిచెందాడు. మృతుడు తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్‌ శివరామన్‌గా గుర్తించారు. శివరామన్‌ సింగరూర్‌లోని సూపర్‌సోనిక్‌ మెయిటెనెన్స్‌ సర్వీస్‌లో క్లీనింగ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

ట్యాంకు క్లీన్‌ చేయడానికి వెళ్లి..
మే 23న నేషనల్‌ వాటర్‌ ఏజెన్సీ పబ్‌కి చెందిన చోవాచు కాంగ్‌ వాటర్‌ వర్క్స్‌లో భాగంగా ట్యాంకు క్లీన్‌ చేసేందుకు వెళ్లాడు. ట్యాంకులో దిగి శుభ్రం చేస్తుండగా అందులో విష వాయువులు వెలువడ్డాయి. వాటిని పీల్చుకున్న శివరమాన్‌ అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరో ఇద్దరు కార్మికులు కూడా ఆస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈమేరకు సింగపూర్‌లో కార్మికులను నియమించే స్టార్‌ గ్రూప్‌ ఎస్ట్‌ కంపెనీ తెలిపింది.

హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వాయువు..
ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో ట్యాంకులో హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వాయువు వెలువడిందని, దానిని పీల్చడంతో ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారని తేల్చారు. శివరామన్‌ పరిస్థితి విషమించి ఆస్పత్రిలో మృతిచెందినట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య నర్మద, ఇద్దరు కూతుళ్లు మహాశ్రీ, శ్రీనిషా, సింగపూర్‌లోని ఆహార పరిశ్రమలో పనిచేస్తున్న మోహన్‌ నవీన్‌కుమార్‌ అనే సోదరుడు ఉన్నారు.

మృతదేహం అప్పగింత..
ప్రమాదం జరిగిన రోజే కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన అధికారులు శివరామన్‌ మృతదేహాన్ని మే 26న కుటుంబ సభ్యులకు అందించారు. మంగళవారం(మే 28న) అతడి మృతదేహాన్ని తమిళనాడులోని స్వగ్రామానికి తరలించినట్లు తెలిసింది.

మలేషియా వెళ్లాలనుకుని..
వాస్తవానికి శివరామన్‌ మే 27న మలేషియా వెళ్లాలనుకున్నాడు. ఈమేరకు సెలవు కూడా తీసుకున్నాడు. అంతకు ముందురోజు రెస్ట్‌ తీసుకోవాలని కూడా భావించాడు. కానీ ఇంతలోనే మే 23న అస్వస్థతకు గురై మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.