6 దేశాల్లో 6 సెంచరీలు: సంజూ స్థానంలో వైభవ్‌ సూర్యవంశీ ఫిక్స్‌

భారత క్రికెట్‌లోకి దూసుకువచ్చిన సరికొత్త సంచలనం పేరు వైభవ్‌ సూర్యవంశీ. తోటి పిల్లలంతా స్కూల్‌ చదువుతో బిజీగా ఉంటే.. అతడు మాత్రం అద్భుత బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తున్నాడు.


పద్నాలుగేళ్ల వయసుకే ఇప్పటికే ఆరు దేశాల్లో ఆరు సెంచరీలు చేసి మరో ‘మాస్టర్‌ బ్లాస్టర్‌’గా నీరాజనాలు అందుకుంటున్నాడు.

దూకుడైన ఆటకు మారుపేరైన వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. భారత అండర్‌-19 జట్టు కెప్టెన్‌గానూ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. సౌతాఫ్రికా అండర్‌-19 జట్టుతో బుధవారం ముగిసిన మూడు మ్యాచ్‌ల యూత్‌ వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేశాడు. ఆఖరి వన్డేలో విధ్వంసకర శతకం బాది.. మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

సెంచరీల మోత
చెన్నై వేదికగా 2024లో ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టు (104)తో యూత్‌ టెస్టులో శతక్కట్టిన వైభవ్‌.. ఐపీఎల్‌-2025లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున గుజరాత్‌ టైటాన్స్‌(101)పై సెంచరీ సాధించాడు. గతేడాది ఇంగ్లండ్‌ గడ్డ మీద యూత్‌ వన్డేలో శతకం (143) నమోదు చేసిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌… ఆస్ట్రేలియాలో యూత్‌ టెస్టులోనూ (113) శతక్కొట్టాడు.

ఇక ఇండియా-ఎ తరఫున దోహా వేదికగా యూఏఈపై టీ20 సెంచరీ (144) సాధించిన వైభవ్‌ సూర్యవంశీ.. తన సొంతజట్టు బిహార్‌ తరఫున దేశీ క్రికెట్‌లో మహారాష్ట్రపై టీ20 శతకం (108*) సాధించాడు. అనంతరం దుబాయ్‌లో యూఏఈ అండర్‌​-19 జట్టుతో యూత్‌ వన్డేలో (171)లోనూ శతక్కొట్టిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. ఇటీవల విజయ్‌ హజారే వన్డే టోర్నీలో అరుణాచల్‌ ప్రదేశ్‌పై (190) భారీ శతకం సాధించాడు. తాజాగా సౌతాఫ్రికాతో మూడో యూత్‌ వన్డేలో 127 పరుగులతో సత్తా చాటాడు.

ఆరు దేశాల్లో ఆరు సెంచరీలు
ఇలా భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, ఖతార్‌, యూఏఈ, సౌతాఫ్రికా దేశాల్లో సెంచరీలు చేసి.. తాను ఎక్కడైనా బ్యాట్‌ ఝులిపించగలనని నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే వైభవ్‌ టీమిండియాలో అరంగేట్రం చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విషయంపై భారత దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పందిస్తూ.. ”171(95), 50(26), 190(84), 68(24), 108*(61), 46(25) & 127(74)… గత ముప్పై రోజులుగా దేశీ, అండర్‌-19 క్రికెట్‌లో వైభవ్‌ సూర్యవంశీ సాధించిన స్కోర్లు ఇవి.

ఏంటి తమ్ముడూ ఇది!
ఇదంతా ఏంటి తమ్ముడు?… శాంపిల్‌ చూపించావా? మున్ముందు ఇంతకంటే గొప్పగా చెలరేగిపోతావా?.. 14 ఏళ్ల వయసున్న పిల్లాడు ఇలా ఆడుతున్నాడంటే నమ్మబుద్ధికావడమే లేదు. అతడి ఆటను వర్ణించేందుకు మాటలు రావడం లేదు.

సంజూ శాంసన్‌ స్థానంలో
అండర్‌-19 వరల్డ్‌కప్‌-2026లో అతడు షోటాపర్‌ కాబోతున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్‌.. రాజస్తాన్‌ రాయల్స్‌లో సంజూ శాంసన్‌ స్థానంలో పూర్తి స్థాయి ఓపెనర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. వచ్చే నాలుగు నెలలు మనకు వైభవ్‌ జాతరే!

అతడి పట్టుదల, టెంపర్‌మెంట్‌, పరుగుల దాహం.. మనకు సరికొత్త అనుభూతి పంచబోతోంది” అంటూ అశూ.. వైభవ్‌ను ఆకాశానికెత్తాడు. ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ ఓపెనర్‌గా సంజూ స్థానాన్ని ఈ చిచ్చరపిడుగు భర్తీ చేస్తాడని అంచనా వేశాడు.

ఓపెనింగ్‌ స్థానానికి ఎసరు
ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు మరో అడుగు ముందుకు వేసి.. భారత టీ20 జట్టులోనూ సంజూ ఓపెనింగ్‌ స్థానానికి వైభవ్‌ ఎసరుపెట్టబోతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌-2026లో సత్తా చాటితేనే సంజూ స్థానం పదిలంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

ఒకవేళ అన్నీ కలిసివచ్చి ఈ ఏడాదే గనుక వైభవ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెడితే.. క్రికెట్‌ దేవుడు, దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలవడం ఖాయం. సచిన్‌ పదహారేళ్లకు టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తే.. వైభవ్‌ పద్నాలుగు- పదిహేనేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. కాగా బిహార్‌లో 2011, మార్చి 27న వైభవ్‌ సూర్యవంశీ జన్మించాడు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.