6 బంతుల్లో.. 6 సిక్స్‌లు జస్ట్‌మిస్! హార్దిక్ పాండ్యా ఊచకోత

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తృటిలో వరల్డ్ రికార్డ్ చేజార్చుకున్నాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన 6 బంతుల్లో 6 సిక్స్‌ల రికార్డ్‌ను 2 పరుగుల దూరంలో కోల్పోయాడు.


ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బరోడా తరఫున బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా.. ఎలైట్‌ గ్రూప్‌-బీలో భాగంగా రాజ్‌కోట్‌ వేదికగా విదర్భతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. ఇది హార్దిక్ పాండ్యాకు తొలి లిస్ట్-ఏ సెంచరీ. ఈ మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా మొత్తం 92 బంతులు ఆడి 8 ఫోర్లు, 11 సిక్స్‌లతో 133 పరుగులు చేశాడు.

విదర్భ లెఫ్టార్మ్ స్పిన్నర్ పార్త్ రేఖడే వేసిన 39వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా వరుసగా ఐదు సిక్స్‌లు, ఓ బౌండరీ బాది 68 బంతుల్లో శతకం సాధించాడు. ఈ ఓవర్‌లో వరుసగా 5 సిక్స్‌లు బాదిన హార్దిక్ పాండ్యా.. ఆఖరి బంతిని కూడా సిక్స్ బాదేలా కనిపించాడు. కానీ పార్త్ రేఖడే తెలివిగా బౌలింగ్ చేయడంతో స్ట్రైట్ డ్రైవ్ షాట్ ఆడాడు. ఈ బంతి కూడా బౌండరీకి వెళ్లినా.. 6 బంతుల్లో 6 సిక్స్‌ల రికార్డ్ మాత్రం చేజారింది. ఈ ఒక్క ఓవర్‌లోనే హార్దిక్ పాండ్యా 34 పరుగులు పిండుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

భారత్ తరఫున 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టిన రికార్డ్ యువరాజ్ సింగ్, రవి శాస్త్రి, రుతురాజ్ గైక్వాడ్‌లపేరిట ఉంది. యువరాజ్ సింగ్ అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లండ్‌పై అరంగేట్ర టీ20 ప్రపంచకప్‌లో ఈ ఫీట్ సాధించగా.. రవి శాస్త్రి రంజీల్లో ఈ ఘనతను అందుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 2022లోనే రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్‌లో 7 సిక్స్‌లు బాదాడు. మరో సిక్స్ బాది ఉంటే ఈ అరుదైన జాబితాలోకి హార్దిక్ పాండ్యా కూడా రీఎంట్రీ ఇచ్చేవాడు.

ఈ మ్యాచ్‌లో 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ బరోడాను హార్దిక్ పాండ్యా ఆదుకున్నాడు. తన అన్న కృనాల్ పాండ్యా(50 బంతుల్లో 23), విష్ణు సోలంకి(17 బంతుల్లో 26) సాయంతో జట్టును గట్టెక్కించాడు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బరోడా 50 ఓవర్లలో 9 వికెట్లకు 293 పరుగుల భారీ స్కోర్ చేసింది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.