భద్రాచలంలో కుప్పకూలిన ఆరంతస్తుల భవనం

భద్రాచలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ ఆరు అంతస్తుల భవనం నిట్టనిలువునా కూలిపోయింది.. ఇద్దరు తాపీ మేస్త్రీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. అయితే పలువురు కూలీలు కూడా ఉండే అవకాశముందని అనుమానిస్తున్నారు. బాధితులను కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం భద్రాద్రి రామయ్య ఆలయానికి కూతవేటు దూరంలో (సూపర్‌ బజార్‌ సెంటర్‌లో) ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీపతి నేషనల్‌ సేవా ట్రస్టుకు చెందిన శ్రీ విజయ కనకదుర్గ భవానీ దేవస్థానం భద్రాద్రి భవానీ పేరుతో అక్కడ భవన (గుడి) నిర్మాణం చేపట్టింది. సుమారు 35 ఏళ్ల క్రితం నిర్మించిన పాత ఇంటిపైనే సామర్థ్యానికి (జీ+1కు అనుమతి) మించి జీ+5 నిర్మాణం చేపట్టడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఒక్కసారిగా భవనం పేక మేడలా కూలి పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో స్థానిక జగదీశ్‌కాలనీకి చెందిన మేస్త్రీ పడిచాల ఉపేందర్‌రావు, లంబాడీ కాలనీకి చెందిన మేస్త్రీ కామేశ్‌ ఉన్నట్లు వారి కుటుంబీకుల ద్వారా తెలిసింది.


ప్రమాద విషయం తెలిసి ఇద్దరి కుటుంబీకులు అక్కడికి చేరుకొని బోరున విలపించారు. అయితే మేస్త్రీలకు సాయంగా కూలీలు కూడా అక్కడ ఉండే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం ఘటనపై స్థానికుల సమాచారంతో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, విద్యుత్తు శాఖ అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వీ పాటిల్‌, ఎస్పీ రోహిత్‌రాజ్‌, ఆర్డీవో దామోదర్‌రావు, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్‌ తదితరులు హుటాహుటిన చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సింగరేణి రెస్క్యూ బృందాన్ని రప్పించారు. సింగరేణి కార్మికులు సారపాక ఐటీసీ నుంచి తెప్పించిన యంత్రాలతో శిథిలాలు తొలగిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో చిక్కుకుపోయిన మేస్త్రీ కామేశ్‌ తనను కాపాడాలంటూ అరుస్తున్నట్లు సహాయక సిబ్బంది గుర్తించారు. అతడున్న గ్రౌండ్‌ ఫ్లోర్‌ స్లాబ్‌కు రంధ్రం చేసి ఆక్సిజన్‌, నీరు అందిస్తున్నారు. కలెక్టర్‌ జితేశ్‌తో పాటు అధికారులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకుపోయారన్న దానిపై అధికారులు స్పష్టతనివ్వలేదు. ఇటు భవన యజమాని శ్రీపతి దంపతులు పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం.