స్మార్ట్ఫోన్కు బానిస అవ్వడం వల్ల పెద్దలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. క్రమంగా ఇది పిల్లల్లో కూడా కనిపిస్తుంది.
స్మార్ట్ ఫోన్‌కి బానిసైపోతున్న చిన్నారులు ఎందరో. ఇదే గనుక మీ పిల్లలకు ఉంటే.. జాగ్రత్త. ఎందుకంటే అది తీవ్రమైన నష్టాలతో.. మరింత ప్రమాదకరంగా మారుతుంది. తాజా అధ్యయనం ప్రకారం.. పిల్లలకు చిన్న వయస్సులోనే ఫోన్ ఇస్తే.. వారు అనేక నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి పిల్లలలో నిద్ర లేకపోవడం, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఎక్కువ అవుతాయట.
అధ్యయనంలో షాకింగ్ విషయాలు
అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో.. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మొబైల్ ఉపయోగించే వ్యసనం ఉంటే.. వారిలో నిద్ర సమస్యలు, బరువు పెరగడం, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు ఉన్నట్లు తేలింది. అధ్యయనం ప్రకారం.. ఫోన్ కారణంగా పిల్లల దినచర్య దెబ్బతింటుంది. దీనివల్ల ఇతర సమస్యలు మొదలవుతాయి. ఫోన్ ఉన్న పిల్లలు రాత్రిపూట స్క్రోలింగ్ చేస్తూ తక్కువ నిద్రపోతారు. స్క్రీన్ సమయం కారణంగా శారీరక శ్రమ తగ్గిపోతుంది. దీనితో పాటు సోషల్ మీడియాలోని నెగిటివ్ కంటెంట్ పిల్లల మనస్సుపై ప్రభావం చూపుతుంది. దానిని వారి మనస్సు అర్థం చేసుకోవట్లేదని.. దీనివల్ల మానసిక సమస్యలు పెరుగుతున్నాయని గుర్తించారు.
అధ్యయనంలో 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఫోన్ ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటున్నారని.. కానీ వారు సోషల్ మీడియాలో చూసే కంటెంట్ ఇంపాక్ట్ వారిపై రకారకాలుగా ఉంటుందని తెలిపారు. చిన్న వయస్సులోనే స్మార్ట్ఫోన్ ఇస్తే వారికి నైపుణ్యాలు అభివృద్ధి చెందవని తెలిపారు.
నష్టాలను నివారించే మార్గం ఇదే
భద్రత లేదా ఆన్లైన్ స్టడీ వంటి ఇతర కారణాల వల్ల చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇస్తున్నారు. అలాంటి పేరెంట్స్ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వారి నుంచి ఫోన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే మొబైల్ యాప్స్ కంట్రోల్ పేరెంట్స్ సెట్ చేయాలని.. సోషల్ మీడియాకు పిల్లలను దూరంగా ఉంచాలని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో రీచ్ కోసం చాలామంది పేరెంట్స్ తమ పిల్లల ప్రైవసీని సోషల్ మీడియాలో పెడుతున్నారని.. అది ఏమాత్రం మంచిది కాదని.. పిల్లల సేఫ్టీ కూడా దీనిపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. పిల్లలకు ఇలా ఐడీలు క్రియేట్ చేయడం వల్ల దానికి వచ్చే నెగిటివ్ కామెంట్స్ వారిపై తెలియకుండానే ప్రభావితం చూపిస్తుంది.
పిల్లలకు స్క్రీన్ సమయాన్ని సెట్ చేయాలని చెప్తున్నారు. మొబైల్ గేమ్స్ కంటే.. బయట గేమ్స్ ఆడేలా ప్రోత్సాహించాలి. పిల్లల డిస్టర్బెన్స్ ఉండొద్దని.. వారికి ఫోన్ ఇచ్చేయడం చేయకుండా.. పిల్లలతో కూర్చొని మాట్లాడుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వారి మానసిక పరిస్థితి మెరుగవుతుంది. అలాగే స్టడీపై ఆసక్తి కూడా పెరిగే అవకాశం ఉంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.


































