Palk Strait: శ్రీలంక-భారత్‌ ప్రతిపాదిత రోడ్డు మార్గం.. ద్వీపదేశం ఏమందంటే!

www.mannamweb.com


భారత్‌-శ్రీలంక మధ్య భూ అనుసంధానం సాధ్యాసాధ్యాలపై చేస్తోన్న అధ్యయనం తుది దశకు చేరుకుందని తెలిపింది.

భారత్‌-శ్రీలంక మధ్య భూ అనుసంధానం ప్రతిపాదనపై ద్వీపదేశం కీలక ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై చేస్తోన్న అధ్యయనం తుది దశకు చేరుకుందని తెలిపింది. మన్నార్‌ జిల్లాలో జరుగుతోన్న అభివృద్ధి పనులను పర్యవేక్షించిన ఆ దేశ అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే.. ప్రతిపాదిత భూ మార్గం అధ్యయనంపై ప్రాథమిక అంశాలు ముగిశాయని, త్వరలోనే తుది దశ నివేదిక పూర్తవుతుందన్నారు.

ఇరుదేశాల మధ్య పవర్‌ గ్రిడ్‌ ప్రతిపాదనపైనా భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో చర్చించే అవకాశం ఉందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే వెల్లడించారు. వీటితోపాటు ట్రింకోమలీ జిల్లాలో పారిశ్రామిక జోన్‌ ఏర్పాటు, మన్నార్‌లో అదానీ గ్రూపునకు చెందిన విండ్‌ పవర్‌ ప్రాజెక్టుతో పాటు శ్రీలంకలో భారత్‌ చేపడుతోన్న అన్ని ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు శ్రీలంక అధికారులు పేర్కొన్నారు.

జూన్‌ 20న భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ శ్రీలంకలో పర్యటించనున్నట్లు ఆ దేశ విదేశాంగశాఖ వెల్లడించింది. అయితే, దీనిపై భారత్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రకటన వస్తే మాత్రం.. ఆయనకు రెండోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి విదేశీ పర్యటన కానుంది. ఇదిలాఉంటే, తమిళనాడు-శ్రీలంకను వేరు చేసే పాక్‌ జలసంధి (Palk Strait).. ఇరుదేశాల మత్స్యకారులు మత్స్యసంపద కోసం దీనిపైనే ఆధారపడుతుంటారు. ఈ క్రమంలో ఒకరి జలాల్లోకి మరొకరు అక్రమంగా చొరబడుతున్నారనే ఆరోపణలపై అరెస్టు అవుతుంటారు.