ఈ ఆలయాన్ని దర్శిస్తే వెయ్యి శివాలయాల దర్శన పుణ్యం
బ్రహ్మసూత్రం కలిగిన శివాలయాన్ని దర్శించుకుంటే వెయ్యి శివాలయాలను ఒకేసారి దర్శించిన పుణ్యఫలాన్ని భగవంతుడు మన ఖాతాలో వేస్తాడు. అటువంటి శివాలయం ఎక్కడ ఉందో తెలుసా?..
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని శ్రీముఖలింగం గ్రామంలో ఉంది. శ్రీకాకుళం నుంచి 46 కిలోమీటర్లు, జలుమూరు నుంచి 12 కిలోమీటర్లు, ఆముదాలవలస నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఈ విశిష్ట క్షేత్రం ఉంది. ఈ గ్రామంలో ఉన్న సోమేశ్వరస్వామి దేవాలయ విశిష్టత తెలుసుకుంటేనే విశేష పుణ్యఫలం దక్కుతుంది.
అదే ఇక్కడి ప్రత్యేకత
ప్రపంచంలో ఎక్కడ ఏ దేవాలయం కొలువుదీరినా అది తూర్పు ముఖంగా ఉంటుంది. ఎక్కడన్నా కొన్ని దక్షిణాభి ముఖంగా ఉంటాయి. అయితే సోమేశ్వరాలయం మాత్రం పశ్చిమ అభిముఖంగా ఉంటుంది. సాయంత్రం సూర్య కిరణాలు, రాత్రి చంద్రకిరణాలు సోమేశ్వరస్వామి దేవాలయం లోపల గల శివలింగంపైన పడతాయి. ఇదే ఇక్కడి విశిష్టత.
వంశధారలో స్నానం చేయగానే..
పురాణాల ప్రకారం దక్ష మహారాజుకు 64 మంది కుమార్తెలు ఉంటారు. వారిలో 27 మందిని చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు. చంద్రుడు మాత్రం తార, రోహిణి అనే ఇద్దరితో బాగా సఖ్యంగా ఉంటాడు. మిగిలినవారితో సఖ్యతగా ఉండటంలేదని వారంతా దక్షుడికి చెప్పడంతో ఆయన చంద్రుడిని పిలిచి మందలిస్తాడు. అయినప్పటికీ చంద్రుడు మారడు. అప్పుడు దక్షుడు చంద్రుడికి కుష్టురోగం వస్తుందంటూ శపిస్తాడు. వ్యాధి నివారణ కోసం చంద్రుడు ఎన్నో పుణ్య నదుల్లో స్నానం చేసినప్పటికీ తగ్గదు. చివరకు వంశధార నదిలో స్నానం చేయగానే కుష్టు వ్యాధి నయమవుతుంది.
రోగాలన్నీ తగ్గిపోతాయి
దీనికి గుర్తుగా చంద్రుడు తన స్వహస్తాలతో బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగాన్ని పశ్చిమాభిముఖంగా ప్రతిష్టిస్తాడు. ఈ లింగాన్ని దర్శిస్తే వెయ్యి శివలింగాలను దర్శించిన ప్రయోజనం దక్కుతుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నవారు ఈ లింగాన్ని దర్శించుకొని అభిషేకం చేస్తే వారి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.