ఇంట్లో ఉండేకంటే ఉద్యోగానికి వెళితే తగ్గుతున్న ఒత్తిడి.. అధ్యయనంలో వెల్లడి

సాధారణంగానే ఇంట్లో ఉండేవారికంటే ఉద్యోగాలు చేసేవారు అధిక ఒత్తిడికి గురవుతుంటారని అందరూ అనుకుంటారు. కానీ జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA) నెట్‌వర్క్ ఓపెన్‌లో పబ్లిషైన ఒక అధ్యయనం మాత్రం అందుకు భిన్నమైన ఫలితాలను వెల్లడించింది.


జాబ్స్‌కు వెళ్లేవారికంటే, ఇంట్లో ఉండేవారే ఎక్కువ స్ట్రెస్ అనుభవిస్తుంటారని పేర్కొన్నది. ముఖ్యంగా ఇంటి పనులు, పిల్లల సంరక్షణ, కుటుంబ బాధ్యతలు చూసుకోవడం, తమ వృత్తి పరమైన బాధ్యతలకంటే చాలా కష్టమని పలువురు అభిప్రాయపడినట్లు అధ్యయనం స్పష్టం చేసింది. చిన్న పిల్లలున్న తల్లిదండ్రులపై ఈ ప్రభావం మరింత అధికంగా ఉంటుందని తెలిపింది.

అధ్యయనం ప్రకారం.. ఇంట్లో ఉండేవారే కాదు, ఇంటి నుంచి పనిచేసే (Work from home) వారిలో కూడా ఒత్తిడి ఎక్కువ. ముఖ్యంగా చిన్న పిల్లలు కలిగి ఉన్న తల్లిదండ్రుల్లో 40 శాతం మంది పిల్లల పెంపకంతో ముడిపడిన అధిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు. అదే బయట ఉద్యోగం చేసే వారు కేవలం 27 శాతం ఒత్తిడిని మాత్రమే ఎదుర్కొంటున్నారు. ఇక పూర్తిగా ఇంట్లోనే ఉండి కేవలం పిల్లల్ని చూసుకునే తల్లులు (Stay-at-home moms) కూడా, ఉద్యోగం చేసే తల్లుల కంటే ఎక్కువ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని పరిశోధనలు తేల్చాయి. ఈ ఒత్తిడి కేవలం శారీరక శ్రమతో ముడిపడి ఉండటం లేదు. పిల్లల భావోద్వేగ అవసరాలు, నిరంతరం శ్రద్ధ అవసరమైన పనులు, ఇంట్లో ఉండేవారికి శ్రమకు తగిన గుర్తింపు లభించకపోవడం, సమాజం నుంచి ఆశించిన గౌరవం లభించకపోవడం వంటి అంశాలు కూడా దీనికి కారణం అవుతున్నాయని అధ్యయనం స్పష్టం చేసింది. మొత్తానికి పిల్లల సంరక్షణ, ఇంటి బాధ్యతలు అనేవి హెవీ మెంటల్ అండ్ ఎమోషనల్ బర్డన్‌తో కూడినవి కావడం ఒత్తిడికి దారితీస్తున్నాయి. అయితే సమాజం కూడా ఈ కృషిని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, ఇంట్లో ఉండే వారిని తరచుగా తక్కువ అంచనా వేయడం మరింత అధిక ఒత్తిడికి కారణం అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఒత్తిడి నుంచి రిలీఫ్ కోసం ..

*ఇంట్లో పిల్లలతో ఉండే తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు (Especially stay-at-home moms) ఒత్తిడి తగ్గించుకోవడానికి రోజుకు 10-15 నిమిషాలు మెడిటేషన్ లేదా డీప్ బ్రీతింగ్ (4-7-8 టెక్నిక్) ఫాలో అవడం బెటర్ అంటున్నారు నిపుణులు. పిల్లలు నిద్రపోయినప్పుడు లేదా ఉదయం త్వరగా లేచినప్పుడు ఇలా చేయవచ్చు.

*రోజులో కనీసం 20-30 నిమిషాలు నడక, యోగా వంటివి చేయవచ్చు. పిల్లలు కాస్త పెద్దవారైతే వారిని కూడా వాకింగ్‌కు తీసుకెళ్లవచ్చు. వారితో కలిసి గ్రౌండ్‌లో వివిధ ఆటలు ఆడటంవల్ల కూడా స్ట్రెస్ రిలీఫ్ అవుతారు.

*ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లలను చూసుకోవడం చాలా ఒత్తిడితో కూడిన పని కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకోండి. అన్ని పనులు ఒకేసారి చేయాలనుకోవడం ఆందోళనకు కారణం అవుతుంది. కాబట్టి పనులను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టండి. మీరు ఏ పనిచేస్తున్నా 25 నిమిషాలు పని తర్వాత 5 నమిషాలు విరామం తప్పక తీసుకోండి.

*పిల్లలు నిద్రపోయిన తర్వాత వీలైతే పుస్తకం చదవడం, సీరిస్ చూడటం, హాట్ షవర్ చేయడం, ఇంకా ఏదైనా హాబీని అనుసరించడం కూడా ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

*రోజులో 2-3 సార్లు కూడా 2 నిమిషాల “మైండ్‌ఫుల్ బ్రేక్” తీసుకోవచ్చు. కళ్లు మూసుకొని శ్వాస మీద దృష్టి పెట్టడం, ఇష్టమైన వ్యక్తులను, దృశ్యాలను, ప్రదేశాలను ఊహించుకోవడం కూడా ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

*ఇంట్లోనే చిన్న “రిలాక్స్ కార్నర్” ఏర్పాటు చేసుకోవచ్చు. కుషన్స్, మ్యూజిక్, అరోమా క్యాండిల్స్ లేదా ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్ వంటివి. ముఖ్యంగా స్క్రీన్ టైమ్ తగ్గించి మనసును ఆహ్లాద పరిచే పనులను చేయడం, ప్రకృతిని ఆస్వాదించడం, కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో మాట్లాడటం ఒత్తిడి నుంచి రిలీఫ్ అందిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.