ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన తర్వాత భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఒక ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడాడు. గతంలో ఐసీసీ కప్పు గెలిపించలేకపోయిన తన ఐదు సెంచరీలకు విలువ లేదన్నాడు.
ఈ సందర్భంగా సిరీస్‌లో టీమ్ ఇండియా ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ గెలవడం గురించి గొప్పగా చెప్పాడు.
దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సిరీస్‌లో భారత జట్టు ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ గెలిచి 3వ సారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒకసారి శ్రీలంకతో పంచుకోవడం విశేషం. ఈ సిరీస్‌లో భారత జట్టు ఆడిన గ్రూప్ మ్యాచ్‌లు వరుసగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లపై గెలిచి మొదటి సెమీఫైనల్‌కు వెళ్లింది. అందులో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు చేరింది.
9వ తేదీన జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించి 3వ సారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ఈ విజయం తర్వాత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఒక ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఆయన మాట్లాడిన విషయాలు చూద్దాం. ‘5 మ్యాచ్‌ల్లోనూ టాస్ ఓడిపోయాం. కానీ, ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నాం. అదెంతో సంతోషంగా అనిపించింది’.
ఏ సీరీస్‌లోనైనా ఓటమి లేకుండా చివరి వరకు వెళ్లడం పెద్ద సవాలుగా ఉంది, కానీ మేం దాన్ని సాధించాం. ఛాంపియన్ అయిన తర్వాతే దీని ప్రత్యేకత తెలిసింది. ప్రతి ఒక్కరూ తమ పాత్రను, బాధ్యతలను స్పష్టంగా అర్థం చేసుకుని పనిచేశారు. మైదానంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మేం ఆటపై నిబద్ధతతోనే వ్యవహరిస్తాం. మా జట్టు ముఖ్య ఉద్దేశం విజయాన్ని సాధించడం.. దానికోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
జస్ప్రీత్ బుమ్రా లేని సమయంలో భారత జట్టు ప్రణాళిక:
“బుమ్రా జట్టులో లేకపోవడం మాకు పెద్ద లోటు. అయితే దానికి అనుగుణంగా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాం. అతని గాయం పూర్తిగా నయం కావాల్సి ఉంది, ఎందుకంటే అతను ఇంకా చాలా సంవత్సరాలు ఆడాల్సిన ఫాస్ట్ బౌలర్. ఈ లోటును ఎలా అధిగమించాలో ప్లాన్ చేస్తున్నప్పుడు, మహ్మద్ షమీ మనకు ఉండటం పెద్ద బలంగా అనిపించింది. షమీ ఐసీసీ మ్యాచ్‌లలో గొప్పగా నిరూపించుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టుపై అతను ఆడిన రెండు మ్యాచ్‌లు మాకు నమ్మకాన్ని కలిగించాయి. అంతేకాకుండా, అర్ష్‌దీప్, హర్షిత్ వంటి బౌలర్లపై మేం పూర్తిగా నమ్మకం ఉంచాం. మ్యాచ్‌కు ముందున్న 20-25 రోజులను ప్రాక్టీస్‌కు, పిచ్ పరిస్థితులను పరిశీలించడానికి ఉపయోగించాం. ఈ పద్ధతి ప్రకారం వ్యవహరించడం వల్లనే బుమ్రా లేకున్నా బాగా ఆడగలిగాం.
2015 ప్రపంచ కప్ సెమీఫైనల్ ఓటమి తర్వాత..
“దాన్ని మా జట్టులో చాలా రోజులుగా చర్చిస్తున్నాం. చాలాసార్లు చివరి దశకు చేరుకున్నాం, కానీ గెలవలేకపోయాం. 2015 సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో, అప్పుడు మనం చాలా తప్పులు చేశాం. అదే పరిస్థితి 2016, 2017 సంవత్సరాల్లోనూ ఎదురైంది. 2023 ప్రపంచ కప్‌లో మొదటి తొమ్మిది మ్యాచ్‌ల్లో బాగా ఆడాం, కానీ ఫైనల్‌లో ఓడిపోయాం.
2019 ప్రపంచ కప్‌లో నేను ఐదు సెంచరీలు కొట్టాను, కానీ జట్టు కప్పు గెలవలేనప్పుడు ఆ రికార్డుకు ప్రాముఖ్యత లేదు. ఆ తర్వాత, జట్టు ఆలోచనలను మార్చడానికి ప్రయత్నించాం. ప్రతి ఒక్కరూ విజయాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోవాలని చెబుతూ వచ్చాం. ఈ కొత్త విధానాన్ని పూర్తిగా అంగీకరించే స్థితికి అందరూ రావడమే విజయానికి కారణం.”
భారత జట్టును ఇతర జట్లు ఎలా చూడాలి?
ఒకే ఒక్క విషయం-మమ్మల్ని ఏ సమయంలోనూ తేలిగ్గా తీసుకోకూడదు. 5 వికెట్లు పడిన తర్వాత కూడా మేం తిరిగి రాగలం. మైదానంలో మా జట్టుకు ఎప్పుడూ ఒక పోరాటం ఉంటుంది. మేం ఎప్పుడూ ధైర్యంగా ఆడతాం, ఏ స్థితి నుంచైనా గెలిచే శక్తి మాకు ఉందని చూపించాలనుకుంటున్నాం. ఆ మేరకు సమష్టి జట్టుగా, ప్రతి ఒక్కరూ తమ పాత్రను తెలిసిన వారిగా వ్యవహరిస్తాం”
ఇక భారత జట్టుతో మీ భవిష్యత్తు?
“నేను ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకోలేదు. 2027 ప్రపంచ కప్‌కు ఆడతానా లేదా అనే దాని గురించి ఇప్పుడే చెప్పాలనుకోవడం లేదు. ప్రస్తుతం నా దృష్టి నా ఆటపై, జట్టుతో కలిసి సమయం గడపడంపై ఉంది. నన్ను జట్టులో నా సహచరులు ఇష్టపడుతున్నారా అనేదే నాకు ముఖ్యమైన విషయం.”