ప్రస్తుతం అంతా డిజిటల్ మయం అయిపోయింది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు అరచేతిలో ప్రపంచం మనచేతిలో ఉన్నట్లే. కాలానికి అనుగుణంగానే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న సినిమాలు కూడా తమ తీరును మార్చుకుంటూ వచ్చాయి. ఒకప్పుడు సినిమా చూడటానికి పల్లెటూళ్ల నుంచి పట్నానికి ఎడ్లబండ్లు కట్టుకొని తండోప తండాలుగా వెళ్లేవారు. ఎన్టీ రామారావు సినిమాలకు ఇలా ఎక్కువగా జరిగేది. లవకుశ, నర్తనశాల, శ్రీకృష్ణపాండవీయం, మిస్సమ్మ, పాతాళభైరవి… ఇలాంటి సినిమాలు చూడటానికి థియేటర్లకు వెళ్లేవారు. ఆరోజుల్లో సినిమాలు వందల రోజుల తరబడి ఆడేవి. సంవత్సరాల తరబడి ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి.
అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పారు క్రమేణా థియేటర్లలో సినిమా ఆడే రోజుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఏడాది, సిల్వర్ జూబ్లీ, శతదినోత్సవం, అర్థ శతదినోత్సవం జరుపుకునే సినిమాలు ప్రస్తుతమైతే రెండు వారాలకు మించి ఆడటంలేదు. అందుకు కారణం టీవీలతోపాటు ఓటీటీలు రావడం,ఒకేసారి ఎక్కువ థియేటర్లలో సినిమాను విడుదల చేసి తక్కువ సమయంలో పెట్టుబడిని రాబట్టుకోవాలని నిర్మాతలు ఆలోచించడం కూడా అందుకు కారణం. దీంతో నెలరోజులు ఒక థియేటర్ లో సినిమా ఆడిందంటే గొప్పగా చూస్తున్నారు. అటువంటిది తెలుగు సినీ చరిత్రలో నిరాటంకంగా మూడు సంవత్సరాలకు పైగా ఆడిన సినిమా ఒకటుంది. అత్యంత అరుదైన ఆ రికార్డును నందమూరి నటసింహం బాలకృష్ణ తన పేరుమీద లిఖించుకున్నారు.
ప్రత్యేకంగా పోస్టర్ విడుదల బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2014 మార్చి 28వ తేదీన విడుదలైన లెజెండ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కడప జిల్లా ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్ లో ఈ సినిమా 2014 నుంచి 2017 వరకు ఆడుతూనే ఉంది. ఈ థియేటర్ యజమాని ఓబుల్ రెడ్డి.. దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి సినిమా 1000 రోజుల పోస్టర్ ను ప్రత్యేకంగా విడుదల చేశారు. అలాగే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కూడా ఈ సినిమా ఇదే రికార్డును నెలకొల్పింది. అక్కడ కూడా వెయ్యి రోజులు పూర్తిచేసుకుంది. ఎమ్మిగనూరు అంటే బాలకృష్ణ సినిమాలకు పెట్టింది పేరు. సినిమా ఫ్లాపైనా అక్కడ 100 రోజులు ఆడుతుంది. అటువంటి క్రేజ్ ను రాయలసీమలో బాలయ్య సొంతం చేసుకున్నారు.