తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ పరీక్ష వ్యవహారం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. మరికొన్ని రోజులపాటు డీఎస్సీని వాయిదా వేయాల్సిందేనంటూ ఆందోళన చేపట్టిన ఓయూ విద్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
దీంతో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జులై 8న అర్ధరాత్రి వర్సిటీలో నిరసన చేపట్టిన విద్యార్ధులు.. పోలీసులు, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు జులై 9న అక్కడ నిరసనలు చేపట్టిన విద్యార్ధుల్లో కొందరిని, ల్యాండ్‌స్కేప్ గార్డెన్ వద్ద ఆందోళన చేస్తున్న మరికొందరిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
జులై 8న హైదరాబాద్ లక్డీకాపుల్‌లోని పాఠశాల విద్యాసంచాలకుల కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రి 11 గంటల ప్రాంతంలో తిరిగి వదిలేశారు. వారు అక్కడి నుంచి నేరుగా ఓయూ ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకుని.. అక్కడి విద్యార్ధులకు తెలిపారు. వీరంతా సమావేశం నిర్వహించుకుని మాట్లాడుకున్నారు. అనంతరం తెల్లవారుజామున హాస్టల్స్‌కు వెళ్తుండగా పోలీసులు అక్కడికి చేరుకుని పెద్ద సంఖ్యలో విద్యార్థులను అరెస్ట్ చేశారు. పోలీసుల దుశ్చర్యను నిరసిస్తూ కొందరు విద్యార్థులు ఓయూలోని ల్యాండ్‌స్కేప్ గార్డెన్ వద్ద సమావేశానికి పిలువునిచ్చారు. ఆ ప్రకారంగా అదే రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో విద్యార్థులు ల్యాండ్‌స్కేప్ గార్డెన్ వద్దకు చేరుకుంటుండగా ఓయూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. విద్యార్థులను వెంటాడి మరీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన విద్యార్ధుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వారిని ఎక్కడికి తరలించారనే విషయం సహచర విద్యార్ధులకు చెప్పకపోవడంతో మరికొంత మంది విద్యార్ధులు ఆందోళనకు దిగారు.
డీఎస్సీని పరీక్షను కనీసం 3 నెలలు వాయిదా వేయాలని, పోస్టుల సంఖ్యను 25 వేలకు పెంచి మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ విద్యార్ధి సంఘాల నాయకులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసనలకు దిగారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. పోలీసులు ఓయూలోని పలు విద్యార్ధి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి బొల్లారం ఠాణాకు తరలించారు.