ఆయనొక న్యాయమూర్తి. హోలీ పండుగ కోసం కుటుంబంతో సహా సొంత ఊరికి వెళ్లారు. సరిగ్గా అదే టైంలో ఆయన అధికారిక బంగ్లాలో మంటలు చెలరేగాయి. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు ఆర్పుతున్న టైంలో ఒక గదిలో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో అంతా షాక్‌కు గురయ్యారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. ఆయనపై బదిలీ వేటు వేసింది!.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ(Justice Yaswant Varma) ఇంట నోట్ల కట్టలు బయటపడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ కరెన్సీకి సరైన లెక్కలు కూడా లేవని సమాచారం. దీంతో ఆయనను సుప్రీం కోర్టు కొలిజీయం(Supreme Court Collegium) ఏకాభిప్రాయంతో ఆయన్ని బదిలీ కింద అలహాబాద్ హైకోర్టుకు పంపించి వేసింది. అయితే.. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.
మార్చి 14వ తేదీన జస్టిస్ వర్మ ఇంట్లో లేని టైంలో ఫైర్ యాక్సిడెంట్ కాగా.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంటలు ఆర్పిన సిబ్బందికి నోట్ల కట్టలు కనిపించాయి. ఆ కరెన్సీని పోలీసులు సీజ్ చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు సుప్రీం కోర్టు దృష్టికి విషయాన్ని చేరవేశారు. అయితే ఆ కరెన్సీ విలువ ఎంత అనేది మాత్రం బయటపెట్టలేదు.