ఆ FD పథకాలపై వడ్డీ చాలా ప్రత్యేకమైనది.. ఇవే అత్యుత్తమ బ్యాంకులు

ఇటీవల చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం రెండుసార్లు రెపో రేటును తగ్గించింది. ఇది బ్యాంకుల ఎఫ్‌డీ రేట్లను కూడా ప్రభావితం చేసింది. అయితే కొన్ని బ్యాంకులు ఇప్పటికీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలను అందిస్తున్నాయి. ఇవి సాధారణ ఎఫ్‌డీల కంటే ఎక్కువ వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ అనేది వాస్తవానికి పరిమిత కాలానికి ప్రారంభించబడిన ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం. దీని కాలపరిమితి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. 444 రోజులు, 400 రోజులు లేదా 300 రోజుల వ్యవధితో ఈ పథకాలను బ్యాంకులు అందిస్తాయి. సాధారణంగా బ్యాంకులు అందించే ఎఫ్‌డీ వడ్డీ రేట్ల కంటే ఈ స్కీమ్స్‌లో వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. ఈ స్కీమ్ పరిమిత కాలానికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి త్వరిత నిర్ణయం తీసుకోవడం ద్వారా పెట్టుబడి పెట్టడానికి ఒక అవకాశమని నిపుణులు చెబుతున్నాయి. అలాగే తక్కువ రిస్క్ పెట్టుబడి ఎంపికగా స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్ ఉంటాయి. సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లు అదనపు వడ్డీ రేటు ప్రయోజనాన్ని పొందవచ్చు.  స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ అందించే బ్యాంకుల గురించి ఓ సారి తెలుసుకుందాం.


ఎస్‌బీఐ 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అమృత్ వృష్టి యోజన కింద 444 రోజుల వ్యవధితో స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌ను అందుబాటులో ఉంది. ఈ స్కీమ్ కింద సాధారణ పౌరులకు సంవత్సరానికి 6.85 శాతం, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.35 శాతం వడ్డీ ఇస్తున్నారు. అలాగే సూపర్ సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.45 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఈ నూతన వడ్డీ రేట్లు మే 16, 2025 నుండి అమల్లోకి వచ్చాయి.

కెనరా బ్యాంక్ 

కెనరా బ్యాంక్ రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు 444 రోజుల ఎఫ్‌డీ స్కీమ్ అందుబాటులో ఉంచింది. ఈ స్కీమ్ కింద సాధారణ పౌరులకు సంవత్సరానికి 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.75 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఈ రేట్లు ఏప్రిల్ 10, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా 

బ్యాంక్ ఆఫ్ బరోడా స్క్వేర్ డ్రైవ్ డిపాజిట్ పథకం కింద 444 రోజుల ఎఫ్‌డీ స్కీమ్ అందుబాటులో ఉంచింది. ఈ స్కీమ్ కింద సాధారణ పౌరులకు సంవత్సరానికి 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.60 శాతం వడ్డీ రేట్లను అందిస్తున్నారు. సూపర్ సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.70 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఈ సవరించిన రేట్లు మే 5, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఇండియన్ బ్యాంక్ 

ఇండియన్ బ్యాంక్‌నకు సంబంధించిన ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్ ఐఎన్‌డీ సెక్యూర్ 444 రోజులకు అందుబాటులో ఉంచారు. ఈ స్కీమ్ కింద సాధారణ పౌరులకు సంవత్సరానికి 7.15 శాతం, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.65 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.90 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఈ పథకం 2025 సెప్టెంబర్ 30 వరకు ఖాతాదారులకు అందుబాటులో ఉండనుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.