ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసేందుకు ఇచ్చిన గడువు సెప్టెంబర్ 16, 2025తో ముగిసింది. ఐటీ విభాగం గణాంకాల ప్రకారం 7.3 కోట్ల మంది తమ రిటర్నులను దాఖలు చేశారు.
గతేడాదితో పోలిస్తే ఈసారి కాస్త ఎక్కువే రిటర్నులు ఫైల్ అయ్యాయి. ఇప్పుడు ఆ ట్యాక్స్ పేయర్లు అందరు తమకు రావాల్సిన రీఫండ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకునే ముందే మీ ఐటీఆర్ ఫారం ఆమోదం పొందిందా లేదా ప్రాసెస్ అయిందా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇచ్చిన డేటాలో తేడాలు వచ్చి ఐటీఆర్ ప్రాసెస్ చేయకపోవచ్చు. ట్యాక్స్ పేయర్లకు ఐటీ విభాగం నోటీసులు జారీ చేస్తుంది. వాటికి అనుగుణంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
ఐటీఆర్ ఫైల్ చేసిన వారందరూ ఇప్పుడు ఎన్ని రోజులకు తమకు రీఫండ్ వస్తుంది అని ఎదురుచూస్తున్నారు. అయితే, ఐటీఆర్ ఫైల్ చేసి ఇ-వెరిఫై చేసిన తర్వాతే రీఫండ్ ప్రాసెస్ అనేది మొదలవుతుందని గుర్తుంచుకోవాలి. సాధారణంగా ఐటీఆర్ ఫైల్ చేసిన 4-5 వారాల్లో ట్యాక్స్ పేయర్ల బ్యాంకు ఖాతాల్లో రీఫండ్ జమ చేస్తారు. ఈ సమయంలోపు రీఫండ్ ఖాతాలోకి రాకుంటే ఫైల్ చేసిన రిటర్నుల్లో ఏవైనా తప్పులు ఉన్నాయా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం ఏవైనా నోటీసులు పంపించిందా అని చూడాలి. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో తమ రీఫండ్ స్టేటస్ తరుచుగా చెక్ చేస్తూ ఉండాలి.
అయితే, గతంలో కంటే చాలా వేగంగా రీఫండ్ ప్రాసెస్ అవుతున్నట్లు ట్యాక్స్ నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ట్యాక్స్ పేయర్లకు ఐటీఆర్ ఫైల్ చేసి వెరిఫికేషన్ చేసిన వారంలోనే రీఫండ్ వస్తోందంటున్నారు. ఏఐఎస్, టీఐఎస్, ఫారం 26ఏఎస్ వంటి ట్యాక్స్ పోర్టల్ సమాచారంతో ట్యాక్స్ పేయర్ ఇచ్చిన సమాచారం సరిగ్గా ఉంటే వేగంగా ప్రాసెస్ పూర్తయి రీఫండ్ జారీ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే, బిజినెస్ ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్, మల్టిపుల్ డిడక్షన్లు వంటివి ఉన్నప్పుడ అదనపు తనిఖీలు అవసరమవుతాయని, ప్రాసెసింగ్ అనేది 2-4 వారాల వరకు పడుతుందంటున్నారు. ఐటీఆర్ ఇ-వెరిఫై చేసిన తర్వాత ట్యాక్స్ విభాగం ప్రాసెసింగ్ మొదలు పెడుతుంది. చాలా కేసుల్లో 2-5 వారాల్లోనే బ్యాంకు ఖాతాల్లో రీఫండ్ జమ చేస్తుంటారు. సరళమైన రిటర్న్స్ ఉంటే వారికి వేగంగా రీఫండ్ వస్తుంది.
ఐటీఆర్ రీఫండ్ స్టేటస్ చెకింగ్ ప్రాసెస్ ఇదే
ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం వెబ్‌పోర్టల్‌లోకి పాన్ నంబర్ పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ కావాలి. మీ పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసి ఉండాలి. ఒకవేళ చేయకపోతే ముందు ఆ రెండింటిని లింక్ చేయాలి. అందుకోసం లింక్ నౌ బటన్ పై క్లిక్ చేయాలి.
పోర్టల్ లోకి లాగిన్ అయిన తర్వాత టాప్ మెనూలో సర్వీసెస్ సెక్షన్‌లో నో యువర్ రీఫండ్ స్టేటస్‌లోకి వెళ్లాలి.
ఇ-ఫైల్ ట్యాబ్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. వ్యూ ఫైల్డ్ రిటర్న్స్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
రీఫండ్ ఆలస్యం అయ్యేందుకు పలు కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ట్యాక్స్ పేయర్ల బ్యాంక్ అకౌంట్ ప్రీ వాలిడేటెడ్ చేయకపోవడం. తప్పనిసరిగా బ్యాంక్ ఖాతను వాలిడేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ ఖాతాలోని పేరు, పాన్ కార్డులోని వివరాలతో సరిపోలాల్సి ఉంటుంది. అలాగే ఐఎఫ్ఎస్‌సీ కోడ్ సరిగాలేకపోయినా, ఐటీఆర్‌లో పేర్కొన్న అకౌంట్ మూసివేసినప్పుడు, పాన్ నంబర్ ఆధార్ లింక్ చేయని సందర్భంలో రీఫండ్ ఆగిపోతుంది.
































