భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
రాంచీలో జరిగిన మొదటి వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించిన కోహ్లీ, రాయ్‌పూర్‌లో జరిగిన రెండవ వన్డేలో కూడా మరో పవర్ ఫుల్ సెంచరీని నమోదు చేశాడు. కేవలం మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో విరాట్‌కు ఇది వరుసగా రెండవ సెంచరీ కావడం విశేషం.
వన్డేలలో 53వ సెంచరీ
రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ 90 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఈ సెంచరీకి చేరుకోవడానికి అతను ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌లు కొట్టాడు. 38వ ఓవర్ చివరి బంతికి ఒక పరుగు తీయడం ద్వారా కోహ్లీ తన కెరీర్‌లో 53వ వన్డే సెంచరీని పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌కు ముందు రాంచీలో జరిగిన తొలి మ్యాచ్‌లో 120 బంతుల్లో 135 పరుగులు సాధించాడు. ఆ సెంచరీతోనే కోహ్లీ, క్రికెట్‌లో ఒకే ఫార్మాట్‌లో 51 కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచి సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. కోహ్లీ 93 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో సహా 102 పరుగులు చేశాడు.40వ ఓవర్ మొదటి బంతికి అతను ఏరియల్ షాట్ కు ప్రయత్నించి మార్క్రామ్ కు క్యాచ్ ఇచ్చాడు.
రుతురాజ్‌తో రికార్డు పార్ట్నర్ షిప్
రాయ్‌పూర్ వన్డేలో ఓపెనర్ల వికెట్లు త్వరగా పడినా, విరాట్ కోహ్లీ, యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఈ ఇద్దరూ కలిసి మూడవ వికెట్‌కు 156 బంతుల్లో ఏకంగా 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ కూడా 77 బంతుల్లో తన కెరీర్‌లో మొదటి వన్డే సెంచరీని సాధించాడు. విరాట్, రుతురాజ్ సెంచరీల కారణంగా భారత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతుంది.
ఐసీసీ ర్యాంకింగ్‌లలో దూకుడు
విరాట్ కోహ్లీ ఈ అద్భుతమైన ప్రదర్శన కారణంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నాలుగవ స్థానానికి చేరుకున్నాడు. రాంచీలో సాధించిన 135 పరుగుల సెంచరీ అతనికి కలిసొచ్చింది. 37 ఏళ్ల కోహ్లీ ప్రస్తుతం 751 రేటింగ్ పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉన్నాడు. ఈ లిస్ట్‌లో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (783), న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ (766), ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ (764) కోహ్లీ కంటే ముందున్నారు. మెడ గాయం కారణంగా సౌతాఫ్రికా సిరీస్‌కు దూరమైన శుభ్‌మన్ గిల్ ఐదవ స్థానానికి పడిపోయాడు, అతన్ని కోహ్లీ అధిగమించాడు.


































