నేటి నుంచి కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌

సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో అంతర్జాతీయ పతంగులు, మిఠాయిల పండుగ (కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌) నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.


రాష్ట్ర పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15 వరకు జరిగే ఈ ఫెస్టివల్‌లో 19 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ కైట్‌ ఫ్లయర్స్‌తోపాటు మన దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 55 మంది నేషనల్‌ కైట్‌ ఫ్లయర్స్‌ పాల్గొననున్నారు.

కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌తోపాటు ఈ నెల 13, 14, 15న ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు, 16, 17, 18న సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకుహాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నారు. స్వీట్‌ ఫెస్టివల్‌లోని స్టాళ్లలో తెలంగాణ సంప్రదాయ వంటలతోపాటు పంజాబ్‌, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల మహిళలు తమ ఇండ్లలో తయారు చేసిన పలు రకాల మిఠాయిలను విక్రయించనున్నారు. పరేడ్‌ గ్రౌండ్‌లో ఈసారి 100 చేనేత, హస్తకళల స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. కాగా, 16, 17న గచ్చిబౌలిలోని స్టేడియంలో డ్రోన్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నట్టు మంత్రి జూపల్లి వెల్లడించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.