ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి అన్ని జిల్లాల్లో సీనియారిటీ లిస్టులు మెరిట్ కం రోస్టర్ పద్ధతిలోనే తయారు చేస్తారని విద్యా శాఖ అధికారులు స్పష్టంచేశారు.
ఈ జాబితాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే తెలియజేయాలని చెప్పారు. గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో విద్యా శాఖ డైరెక్టర్ విజయరామరాజు గురువారం సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై సంఘాలు వెలిబుచ్చిన సందేహాలకు వివరణ ఇచ్చారు.
ప్రతి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్మాస్టర్ ప్రమోషన్‌కు అర్హత గల అందరు ఎస్ఏల సీనియారిటీ జాబితా ప్రదర్శిస్తారని తెలిపారు. డీఈవో పూల్ పండిట్ల ప్రమోషన్ విషయమై కోర్టు కేసు ఆధారంగా ముందుకెళ్తామని తెలిపారు. పేరెంట్ కమిటీల నిర్ణయం మేరకే మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతానికి హైసూ్కల్ ప్లస్‌లను కొనసాగించాలని నిర్ణయించామని తెలిపారు.
ఎయిడెడ్ నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్‌లో విలీనమైన వారికి విలీనం అయ్యేటప్పుడు ఉత్తర్వుల్లో ఉన్న నిబంధనల మేరకే సర్వీస్ వెయిటేజీ ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తరగతులు ప్రైవేటు కళాశాలల మాదిరిగానే ఏప్రిల్ నెలలోనే ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలకు, ఇంటర్ కళాశాలలకు ఒకే తరహా సెలవులు ఉండేలా చూస్తామన్నారు.