తల్లికి వందనం’ డబ్బు రాలేదా? అయితే వెంటనే ఇలా చేయండి

 ఏపీలో( Andhra Pradesh) తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది కూటమి ప్రభుత్వం. ఈనెల 12న విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో అదే రోజు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసింది.


అయితే చాలామంది అనర్హుల జాబితాలో చేర్చారు. ప్రధానంగా ఆదాయపు పన్ను కడుతున్న వారు, పది ఎకరాల భూమి అధికంగా ఉన్నవారు, 300 యూనిట్ల విద్యుత్ వాడుతున్న వారు, ప్రభుత్వ ఉద్యోగులు.. ఇలా రకరకాల కారణాల చూపుతూ అనర్హుల జాబితాలో చాలామంది చేరారు. అయితే సాంకేతిక సమస్యలతో చాలామంది అర్హత ఉన్నా.. అనర్హుల జాబితాలో చేరారు. అటువంటి వారికోసం మరోసారి అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అర్హత ఉండి తల్లికి వందనం డబ్బు జమ కాని వారు మరోసారి దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సచివాలయాల్లో అవకాశం..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ/ వార్డు సచివాలయాల్లో గ్రీవెన్స్ సెల్ కు ( grievance cell )అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. వివిధ కారణాలతో అనర్హుల జాబితాలో చేరిన వారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసుకోవచ్చు. అక్కడ పొరపాట్లు, లోటుపాట్లు ఉంటే సరి చేస్తారు. తిరిగి తల్లికి వందనం నిధులు జమ చేస్తారు. రెండు రోజుల కిందట ఈ గ్రీవెన్స్ సెల్ అందుబాటులోకి వచ్చింది. అయితే అవగాహన లేని వారు అటువైపుగా వెళ్లడం లేదు. ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటించడంతో ఇప్పుడు సచివాలయాల్లో రద్దీ నెలకొంది. ఫిర్యాదులు చేసేందుకు పెద్ద ఎత్తున జనాలు బారులు తీరుతున్నారు. ఇలాంటి ఫిర్యాదుదారులు వేలల్లో ఉంటారని తెలుస్తోంది.

20 వరకు ఫిర్యాదులు..
మరోవైపు జూన్ 20 వరకు సచివాలయాల్లో ఈ ఫిర్యాదులను స్వీకరిస్తారు. 21 నుంచి వారం రోజులపాటు ఈ దరఖాస్తులను వెరిఫై చేస్తారు. సాధారణ లోటుపాట్లు ఉంటే అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తారు. ఒకవేళ వేరే శాఖల నుంచి ఇబ్బందులు ఉంటే లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే పరిష్కార మార్గం చూపిస్తారు. అలా పరిష్కారమైన దరఖాస్తులకు సంబంధించి. జూన్ 30న సచివాలయాల్లో కొత్త అర్హుల జాబితాను ప్రకటిస్తారు. జూలై 5న వారి అకౌంట్లలో తల్లికి వందనం నిధులు జమ చేస్తారు. అయితే ఇదే విషయంపై గ్రామ సచివాలయ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తల్లికి వందనం నిధులు జమ కాని వారు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. అయితే ఇందులో 300 యూనిట్ల విద్యుత్ వినియోగానికి సంబంధించి చాలా రకాల ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే నిబంధన పెట్టగా కూటమి ఎద్దేవా చేసింది. అయితే తాజాగా దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు రావడంతో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. 300 యూనిట్ల విద్యుత్ వినియోగానికి సంబంధించి నిబంధనను తొలగించినట్లు సమాచారం. అటువంటి అభ్యంతరంతో సాయం నిలిపివేసిన వారికి తిరిగి ఖాతాల్లో నిధులు జమ చేస్తారని తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.