దేశీయ దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్(Tata Motors) నుంచి విడుదలైన మోడళ్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంటుంది. ప్రయాణికుల సేఫ్టీ పరంగా ఈ కార్లు అత్యంత నమ్మకమైనవి.
ఇదిలా ఉంటే టాటా కంపెనీకి చెందిన హ్యాచ్‌బ్యాక్ మోడల్ టియాగో దేశీయ మార్కెట్లో విక్రయాల పరంగా మెరుగైన గణంకాలు సాధించింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, టియాగో అమ్మకాల్లో సరికొత్త చరిత్రను సృష్టించింది. చిన్న కుటుంబానికి అనువుగా ఉండేటటువంటి ఈ మోడల్‌ను చాలా మంది వినియోగదారులు కొనుగోలు చేశారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, టియాగో హ్యాచ్‌బ్యాక్ 2016 నుంచి ఈ ఏడాది అక్టోబర్(2024) నాటికి దాదాపు మొత్తం 5,96,661 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ప్రజల్లో టాటా కంపెనీకి ఉన్నటువంటి ఆదరణ ఎలా ఉందో ఈ గణాంకాలను చూస్తేనే తెలుస్తుంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది అధికారిక ప్రకటన కాదు, అయినప్పటికీ ఇదే గణంకాలు అధికారికంగా త్వరలో విడుదల కానున్నాయి. టాటా టియాగో ఆకట్టుకునే డిజైన్, ధర కూడా తక్కువగా ఉండటం, పైగా చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఉండటంతో అమ్మకాలు బాగా నమోదయ్యాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ 6 లక్షల యూనిట్ల మైలురాయిని చేరడానికి ఇంకా కేవలం 3,339 యూనిట్లు విక్రయిస్తే చాలు.
అక్టోబర్ నాటికి 5 లక్షలకు పైగా నమోదు కాగా, ఈ నవంబర్ నెల విక్రయాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లయితే మొత్తం టియాగో అమ్మకాల సంఖ్య 6 లక్షలను దాటిందని మార్కెట్ వర్గాలు లెక్కలు వేశాయి. మొదటగా 2019లో ఈ హ్యాచ్‌బ్యాక్ విక్రయాలు దాదాపు 92,369 యూనిట్లుగా నమోదయ్యాయి. అప్పటి నుంచి ఈ మోడల్ గురించి అందరికీ తెలియడంతో రాను రాను మంచి అమ్మకాలను సాధించడం మొదలుపెట్టింది.
ఇటీవలి నెలల్లో జరిగిన విక్రయాలను పరిశీలించినట్లయితే 2024 ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ప్రతినెలా సగటున టియాగో అమ్మకాలు 4,546 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ లెక్కన ప్రతి రోజూ 151 కార్లు అమ్ముడుపోయాయి. తక్కువ ధరలో లభించడం కారణంగా మధ్యతరగతి వారు ఎక్కువగా ఈ కారును కొనుగోలు చేశారు. అందుకే 5.96 లక్షల మంది టియాగో కారును ఇష్టంగా కొన్నారు.
టాటా టియాగో కారు విషయానికి వస్తే, దీని ప్రస్తుత ధర దేశీయ మార్కెట్లో వేరియంట్లను బట్టి రూ.5 లక్షల నుంచి రూ.8.75 లక్షల మధ్య కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ కారు XE, XM, XT(O) వంటి వివిధ వేరియంట్లలో లభిస్తుంది. దీనిలో రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఇది 86 PS పవర్, 113 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
రెండోది సీఎన్జీ వేరియంట్. ఇది 73.5 PS పవర్, 95 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్, CNG రెండిట్లో లభించడంతో చాలా మంది వినియోగదారులను ఇది ఆకర్షించింది. పెట్రోల్ ఆప్షన్ లీటరుకు 19.43 నుంచి 20.01 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను అందిస్తుంది. అదే CNG మోడల్ 26.49 నుంచి 28.06 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను ఇస్తుంది. ఈ కారులో 5 మంది ఈజీగా ప్రయాణించవచ్చు.
టియాగోలో చాలా అధునాతన ఫీచర్లు ఉన్నాయి. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం,ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్రయాణికుల భద్రత కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, పార్కింగ్ సెన్సార్లు, ఎంటర్టైన్మెంట్ కోసం 8-స్పీకర్ సౌండ్ సిస్టం వంటి పలు ఇతర ఫీచర్లు ఉన్నాయి.