ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎన్నో వేదికలపై మాట్లాడినా, ఈ కార్యక్రమం తనకు ప్రత్యేకమైన ప్రేరణనిచ్చిందని సీఎం పేర్కొన్నారు. సమాజంలో ఇంకా మంచి విలువలు బతికే ఉన్నాయని, దానికి ఈ కార్యక్రమమే సాక్ష్యమని వ్యాఖ్యానించారు.
40-50 ఏళ్ల క్రితమే విదేశాలకు వెళ్లినా, జన్మభూమిని మర్చిపోకుండా సేవ చేస్తున్న ప్రవాసులు సమాజానికి ఆదర్శమని సీఎం కొనియాడారు. చదువుకున్న కాలేజీని గుర్తుంచుకుని 1981లోనే జింఖానా ఏర్పాటు చేసి, వందల కోట్ల రూపాయల సేవలందించిన పూర్వ విద్యార్థులను అభినందించారు. ఒకప్పుడు ‘బ్రెయిన్ డ్రెయిన్’పై ఆందోళన వ్యక్తమైతే, భవిష్యత్తులో ‘బ్రెయిన్ గెయిన్’ జరుగుతుందని తాను 1995లోనే చెప్పానని గుర్తుచేశారు. నేడు అదే నిజమవుతోందన్నారు.
“మనమే కాదు… మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలి” అన్నది భారతీయ సంస్కృతి మూలమని చంద్రబాబు స్పష్టం చేశారు. పాఠశాలలు, ఆస్పత్రులు, దేవాలయాలు, సత్రాలు, ఆటస్థలాల నిర్మాణానికి ప్రజలే ముందుకొచ్చి విరాళాలు ఇచ్చిన చరిత్ర మనదేనని గుర్తు చేశారు. డబ్బు సంపాదించడమే కాదు, సమాజానికి కొంత తిరిగి ఇవ్వడంలో ఉండే తృప్తి మరెక్కడా దొరకదన్నారు.
గుంటూరు జీజీహెచ్‌లో మాతా-శిశు సంరక్షణ కేంద్రం విశేషాలు
269,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఐదు అంతస్తులతో నిర్మించిన ఈ మాతా-శిశు ఆరోగ్య కేంద్రం మొత్తం 600 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. ప్రసూతి విభాగంలో 300, పిడియాట్రిక్స్ విభాగంలో 200 పడకలు ఉండగా, మిగిలినవి NICU, SICU, PICU వంటి అత్యవసర విభాగాలకు కేటాయించారు. పూర్వ విద్యార్థులు సుమారు రూ.100 కోట్లు సమకూర్చగా, ఆధునిక పరికరాలు, ఫర్నిచర్ కోసం ప్రభుత్వం రూ.27 కోట్లు కేటాయించింది. గతంలో ఇదే కళాశాల పూర్వ విద్యార్థులు రూ.35 కోట్లతో ఆడిటోరియం కూడా నిర్మించారు.
కోట్ల రూపాయల విరాళాలతో సేవా స్పూర్తి
డాక్టర్ గవిని ఉమాదేవి రూ.22 కోట్లు, నళిని-వెంకట్ తేళ్ల రూ.8 కోట్లు, వాసిరెడ్డి రమాదేవి-కొండ్రగుంట వెంకట్రావు రూ.4.32 కోట్లు విరాళాలు అందించారు. మొవ్వ వేదవతి-వెంకటేశ్వరరావు రూ.4.04 కోట్లు, తేలికిచర్ల-గుడిమెడ కుటుంబాలు రూ.3.60 కోట్లు, డాక్టర్ లక్ష్మీ-చౌదరి గంగ రూ.3.40 కోట్లు, బీనా నూతక్కి-గోపాలరావు రూ.3.20 కోట్లు విరాళాలు ఇచ్చారు. ఈ సేవా కార్యక్రమాలు రాష్ట్ర ఆరోగ్య రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికాయని సీఎం అన్నారు.
చదువు – గేమ్ ఛేంజర్
ఆర్థిక అసమానతలు తగ్గాలంటే చదువే ప్రధాన ఆయుధమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంబేద్కర్, అబ్దుల్ కలామ్ వంటి మహానుభావుల జీవితాల్లో సమాజ సహకారం ఎంత కీలకమో వివరించారు. గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి చదువుకున్న ఎనిమిది మందికి పద్మశ్రీ అవార్డులు రావడం ఆ సంస్థ గొప్పతనానికి నిదర్శనమన్నారు.
పీ4 మోడల్ – అసమానతలకు పరిష్కారం
దేశంలో అభివృద్ధి వేగంగా సాగుతున్నా, ధనిక-పేద మధ్య వ్యత్యాసాలు పెరుగుతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ‘పీ4’ విధానాన్ని ప్రవేశపెట్టామని, పేద కుటుంబాలకు ఆదాయ అవకాశాలు కల్పించడం ద్వారానే అసమానతలు తగ్గుతాయని చెప్పారు. ‘బంగారు కుటుంబాలు’ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 50 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని వెల్లడించారు.
అమరావతి – క్వాంటమ్ వ్యాలీ దిశగా
ప్రపంచం ఐటీ నుంచి ఏఐ దశకు చేరిందని, అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే, భారత్‌లో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఉందని సీఎం స్పష్టం చేశారు. ఒకప్పుడు సైబరాబాద్‌ను నిర్మించామని, నేడు క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టామని చెప్పారు. విద్యుత్ రంగ సంస్కరణలు, ప్రోజ్యూమర్ కాన్సెప్ట్, సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ వంటి పునరుత్పాదక శక్తులపై దృష్టి పెట్టామని వివరించారు.
అమరావతి పై స్పష్టత..
పదేళ్లలో అమరావతి రూపురేఖలు మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం. ఇంకో పదేళ్లలో గుంటూరు-మంగళగిరి-విజయవాడ కార్పొరేషన్లు కలిసిపోయే స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు ప్రకటించారు. గుంటూరుకు 182 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు, కాలుష్య రహిత పునరుత్పాదక శక్తితో నడిచే నగరాలు రూపుదిద్దుకుంటాయని చెప్పారు.
సంజీవని, డ్రోన్ అంబులెన్స్‌తో ఆరోగ్య రంగ విప్లవం
ప్రజల ఆరోగ్యానికి ‘సంజీవని’ పేరుతో డిజిటల్ హెల్త్ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నామని, గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తోందని సీఎం తెలిపారు. ఇప్పటికే కుప్పంలో పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని, ఈ ఏడాదిలోనే 28 జిల్లాల్లో 72 లక్షల మందికి డిజిటల్ హెల్త్ రికార్డులు సిద్ధం చేస్తామని చెప్పారు. 2026లో డ్రోన్ అంబులెన్స్‌లను కూడా ప్రవేశపెట్టాలన్న లక్ష్యాన్ని వెల్లడించారు.

































