Jwala Gutta: తెలుగు ఇండస్ట్రీలో పని చేయాలంటే తెల్లగా ఉంటే చాలు

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల గతంలో ఓ సినిమాలో తళుక్కుమని మెరిసింది. నితిన్‌ కోరిక మేరకు గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంలో డింగ్‌ డింగ్‌ డింగ్‌ డింగ్‌ అనే ఐటం సాంగ్‌లో ఆడిపాడింది.


తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను స్పెషల్‌ సాంగ్‌ చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది.

గుత్తా జ్వాల (Jwala Gutta) మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీ (Tollywood)లో పని చేయాలంటే తెల్లగా ఉంటే చాలు. బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్న నాకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ వాటన్నింటికీ నో చెప్పాను. సినిమాల్లోకి రావాలని కలలో కూడా అనుకోలేదు. అయితే సినీ ఇండస్ట్రీలో నాకెందరో స్నేహితులున్నారు. చిత్రపరిశ్రమలో ఎలా ఉండాలో వారిని చూస్తే అర్థమవుతుంది. వారిలా నేనుండలేను. అక్కడ ఉండాలంటే మనకు సిగ్గు ఉండకూడదు. చాలా విషయాల్లో సర్దుకుపోతుండాలి.

24 గంటలు పనిలోనే..
నా భర్త.. హీరో, నిర్మాత విష్ణు విశాల్‌ (Vishnu Vishal) మూవీ ఇండస్ట్రీలోనే ఉన్నాడుగా.. 24 గంటలు ఆయనకు ఏదో ఒక పని ఉంటుంది. అవన్నీ చూస్తేనే నాకు తల నొప్పి వచ్చేస్తుంది. మేము 10 గంటలు ఆడిన తర్వాత విశ్రాంతి తీసుకోవచ్చు. హాయిగా నిద్రపోవచ్చు. కానీ వాళ్లకేమో డబ్బుల టెన్షన్‌, ఆ షాట్స్‌ సరిగా వచ్చిందా? లేదా? ఇలా ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది. నా భర్త రెడీ అవడానికి 2 గంటలు తీసుకుంటాడు. అంతా పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటాడు. ఇండస్ట్రీలో ఉండేవాళ్లు ఎంతో శ్రమిస్తారు. నిజంగా వాళ్లు చాలా గ్రేట్‌.. ‍ప్రతిఒక్కరికీ ఏదో ఒక అవార్డు ఇవ్వాల్సిందే!

అలా ఐటం సాంగ్‌ చేశా..
ఐటం సాంగ్‌ విషయానికి వస్తే.. అది తల్చుకుంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది. నితిన్‌ (Nithiin) నాకు ఫ్రెండ్‌. ఒక పార్టీలో అతడు.. జ్వాల నువ్వు నా సినిమాలో ఓ పాట చేస్తున్నావ్‌ అన్నాడు. సరేనని తలూపాను. కానీ, సీరియస్‌గా తీసుకోలేదు. మూడు నెలల తర్వాత పాట రెడీ అని నా దగ్గరకు వచ్చాడు. నేను నోరెళ్లబెట్టాను. ఇప్పుడెలా నో చెప్పాలా? అని ఆలోచనలో పడ్డాను. అతడేమో కచ్చితంగా నేను చేయాల్సిందే అని పట్టుబట్టాడు. అలా సెట్‌లో అడుగుపెట్టాను.

ఫ్రీ పబ్లిసిటీ
మొదటి రోజు నా మోకాలివరకు ఉన్న డ్రెస్‌ ఇచ్చారు. రోజురోజుకీ ఆ డ్రెస్‌ చిన్నదైపోతూ వచ్చింది. ఏంటిదంతా? అనుకున్నాను. నాలుగురోజుల్లో సరదాగా షూట్‌ పూర్తి చేశాం. అప్పటికే అతడి సినిమాలు వరుసగా ఫెయిలవుతూ వస్తున్నాయి. గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో నేను సాంగ్‌ చేయడం వల్ల ఆ మూవీకి ఫ్రీగా పబ్లిసిటీ వచ్చింది. తెలుగు సినిమా జాతీయ మీడియాలో కూడా వస్తుందని నితిన్‌ సంతోషపడిపోయాడు. నా పాట వల్ల సినిమా ఫ్లాప్‌ అవకుండా హిట్టయింది. అదొక్కటి నాకు సంతోషంగా అనిపించింది అని గుత్తా జ్వాల చెప్పుకొచ్చింది.