TTD Update: తిరుమల శ్రీవారి భక్తులకు.. టీటీడీ హెచ్చరిక.. ఇకపై అలా చేయవద్దంటూ హితవు

తిరుమల శ్రీవారి భక్తులకు ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక సూచన చేశారు. ఇప్పటి నుండి తిరుమలలో అలా భక్తులు ప్రవర్తించవద్దని, దీనితో భక్తుల రద్దీ వేళ ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఛైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు.


ఇక ఆ పద్దతికి స్వస్తి పలకాలని బీఆర్ నాయుడు ట్వీట్ చేసి మరీ భక్తులకు విన్నవించారు.

కలియుగ వైకుంఠంగా పిలువబడుతున్న తిరుమలకు భక్తులు నిత్యం వస్తుంటారు. శ్రీ శ్రీనివాసుడి దర్శనభాగ్యం కలిగితే చాలు.. తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. అయితే శ్రీవారి దర్శనార్థం భక్తులు దేశ విదేశాల నుండి కూడ వస్తారు. శ్రీవారి దర్శనం టికెట్లను టీటీడీ ఆన్ లైన్ ద్వార అందిస్తుంది. సర్వదర్శనం టోకెన్లను కూడ టీటీడీ అందజేస్తుంది. టోకెన్లు, టికెట్స్ పొందిన భక్తులు తమకిచ్చిన సమయానికి క్యూ లైన్ వద్దకు చేరుకోవాలన్నదే టీటీడీ నిబంధన. కానీ ఇటీవల కొందరు భక్తులు తమ సమయానికి ముందే క్యూ లైన్ వద్దకు చేరుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయి. దీనితో అప్పటికే లైన్ లో దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.

అదే తమకిచ్చిన సమయానికి భక్తులు క్యూ లైన్ లోకి వచ్చిన యెడల ఎటువంటి ఇబ్బందులు ఉండవనే చెప్పవచ్చు. కొందరు భక్తులు సమయానికి ముందు వస్తున్న తీరుతో టీటీడీ అధికారులు అవస్థలు పడుతున్న పరిస్థితి. అందుకే ఇటువంటి ఘటన గురించి చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. భక్తులు ఈ నిబంధన తప్పక పాటించాలని ఆయన కోరారు. తిరుమల శ్రీవారి దర్శనానికి టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లలోకి ప్రవేశించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఇదే విషయాన్ని పలుమార్లు ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులకు తెలియజేశామని, అయినప్పటికీ ఇటీవల కొంత మంది భక్తులు తమకు కేటాయించిన సమయానికి ముందే క్యూలైన్ల వద్దకు వెళ్లి క్యూలైన్లలోకి అనుమతించాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఛైర్మన్ అన్నారు. శ్రీవారి దర్శన టోకెన్లు పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయానికి మాత్రమే క్యూలైన్లలోకి ప్రవేశించాలని ఆయన కోరారు.

టీటీడీ చేసిన ఈ విజ్ఞప్తిని భక్తులు పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిగిలిన భక్తులు కూడ శ్రీవారి దర్శనార్థం వచ్చిన వారే కాబట్టి, వారి ఇబ్బందులను కూడ దృష్టిలో ఉంచుకొని భక్తులు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే భక్తుల సేవలో నిరంతరం తరిస్తున్న టీటీడీ అధికారులకు, సిబ్బందికి సహకరించాల్సిన అవసరం కూడ ఉంది. అందుకే మీ టోకెన్ లో.. మీ టికెట్ లో పొందుపరిచిన సమయానికి శ్రీవారి దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

అలాగే శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 18 నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాలలో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఛైర్మన్, టీటీడీ అధికారులను ఆదేశించారు.