ఆంధ్రప్రదేశ్‌లో పలు కారణాలతో ప్రభుత్వం కేటాయించినా ఇళ్ల నిర్మాణాలు చేపట్టని వారికి రాష్ట్రప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఇళ్ల నిర్మాణ గడువును మరో రెండేళ్లు పొడిగించారు.
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ (PMAY-G) మరియు ప్రధాన్ మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM-JANMAN) పథకాలను ప్రస్తుత యూనిట్ విలువతోనే అమలులో ఉన్న పద్దతితో కొనసాగించడానికి మరియు పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
PMAY అర్బన్ 1.0 పథకం కొనసాగింపు మరియు ప్రస్తుత యూనిట్ ధరతో ఇళ్లను పూర్తి చేయడంతో పాటు గతంలో ప్రకటించిన 3 ఎంపికల కింద నిర్మాణంలో ఉన్న పద్దతి, మెటీరియల్ సరఫరా, కొత్త ఇసుక విధానాన్ని అనుసరించడం ద్వారాడ్రోన్‌లను ఉపయోగించి పెద్ద లేఅవుట్‌లలో నాణ్యత పరీక్ష నిర్వహిస్తారు. డిస్కమ్‌లు, PR&RD మరియు MA&UD విభాగాల సమన్వయంతో హౌసింగ్ కాలనీలలో మౌలిక సదుపాయాలను చేపట్టడానికి చేసిన ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
2024 డిశంబరు నాటికి ఈ పథకాల క్రింద ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలనే నిబంధన ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు 2026 మార్చి వరకు కేంద్రం గడువు ఇచ్చింది అర్బన్ లో 6.41 లక్షల ఇళ్లు, గ్రామాల్లో 1.09 లక్షల ఇళ్లు ను పూర్తి చేయాలనే నిర్ణయించారు.
ఆర్.టి.జి.ఎస్ లో పౌర సేవలు..
చంద్రబాబు మానస పుత్రిక రియల్-టైమ్ గవర్నెన్స్ 4.0 అమలు కోసం మరియు RFPS ఫ్లోటింగ్ కోసం అనుమతించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పౌరసేవలను సులభతరం చేయడం, పాలనలో వేగం పెంచడమే లక్ష్యంతో రియల్-టైమ్ గవర్నెన్స్ 4.0 అమలు చేయటానికి ప్రతిపాదనలు అమోదించారు.
వాట్సాప్ ద్వారా అనేక దృవీకరణ పత్రాలను అందజేసేందుకు చర్యలు తీసుకుంటారు. డాటా ఇంటిగ్రేషన్, అనలటిక్స్ & గవర్నెన్సు హబ్ గా తీర్చిదిద్దడం ప్రొడక్టు డవలెప్మెంట్ హబ్, మల్టీసోర్సు విజ్యువల్ ఇంటెలిజెన్సు హబ్, ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్సు మరియు డీప్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్, పీపుల్స్ పెర్షప్షన్ హబ్ ఏర్పాటుతో పాటు వాతావరణ సంబందిత అంశాల విశ్లేషణకై అవేర్ హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు.
డిశంబర్ 15 న ఆత్మార్పణ దినోత్సవం:
ప్రతి ఏటా డిసెంబర్ 15న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని “ఆత్మర్పణ దినోత్సవం”గా పాటించాలని మరియు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించేందుకు మార్గదర్శకాలను రూపొందించాలనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రను నేటి తరానికి తెలిపే విధంగా ఒక లఘు చిత్రాన్ని రూపొందిస్తారు. ఆయన జన్మ స్థలంలోని ఇంటిని మంచి మ్యూజియంగా తయారు చేస్తారు.
నూతన టెక్స్‌టైల్ పాలసీకి అమోదం…
ఆంధ్రప్రదేశ్ టెక్స్ టైల్, అపెరల్ & గార్మెంట్స్ పాలసీ 4.0కు క్యాబినెట్ అమోదం తెలిపింది. ఐదేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగాలు కల్పించే రంగంలో రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ టెక్స్ టైల్, గార్మెంట్స్ పాలసీని ప్రభుత్వం రూపొందించారు.
2024 – 2029 కాలంలో రాష్ట్రం నుంచి వస్త్ర ఎగుమతుల్ని 1 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో టెక్స్‌టైల్ రంగంలో మంచి నైపుణ్యం కలిగిన ఉన్న పద్మశాలీలు, చేనేత కార్మికుల ఉపాధి అవకాశలు మెరుగుపర్చేందుకు ఈ పాలసీ ఎంతగానో దోహదపడుతుంది.
ఇందుకై అవసరమైన మౌలిక వసతులతో పార్కులను ఏర్పాటు చేయడంతో పాటు రాయితీలను కూడా పెద్ద ఎత్తున ఇస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో (పీపీపీ) 5 కొత్త సమగ్ర టెక్స్ టైల్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. ఈ పార్కులను మూడు కేటగిరీలుగా విభజించి ఎంఎస్ఎంఇ లకు 30 శాతం, మద్య తరహా పార్కులకు 20 శాతం మరియు భారీ పార్కులకు 25 శాతం మేర పెట్టుబడి రాయితీ అందజేస్తారు.