వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. 32 బంతుల్లోనే శతక్కొట్టి.

భారత క్రికెట్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి అద్బుత ప్రదర్శనతో దుమ్ములేపాడు. ​ఆసియా క్రికెట్‌ మండలి (ACC) పురుషుల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌-2025 టోర్నమెంట్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.


ఈ టీ20 ఈవెంట్లో భాగంగా భారత్‌-‘ఎ’ జట్టు తమ తొలి మ్యాచ్‌లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)తో తలపడుతోంది. దోహాలోని వెస్ట్‌ ఎండ్‌ పార్క్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, ఐపీఎల్‌ సెన్సేషన్‌ ప్రియాన్ష్‌ ఆర్య వేగంగా ఆడే (6 బంతుల్లో 10) ప్రయత్నంలో రనౌట్‌ అయ్యాడు.

కేవలం పదహారు బంతుల్లోనే
ఈ క్రమంలో మరో ఓపెనర్‌, భారత చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ నమన్‌ ధీర్‌తో కలిసి.. స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. కేవలం పదహారు బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న వైభవ్‌ సూర్యవంశీ.. ఆ తర్వాత జోరును మరింత పెంచాడు.

ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ
ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చితక్కొడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ వైభవ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఈ లెఫ్టాండర్‌ కేవలం 32 బంతుల్లోనే వంద పరుగులు మార్కు అందుకుని మరోసారి సత్తా చాటాడు. వైభవ్‌ శతక ఇన్నింగ్స్‌లో పది ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి. టీ20 ఫార్మాట్లో అతడికి ఇది రెండో సెంచరీ కావడం విశేషం.

10 ఓవర్లలోనే
వైభవ్‌ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్‌కు తోడు.. నమన్‌ ధీర్‌ కూడా మెరుపులు (21 బంతుల్లో 33) మెరిపించడంతో 10 ఓవర్లలోనే భారత్‌ కేవలం వికెట్‌ నష్టపోయి 149 పరుగులు చేయడం మరో విశేషం.

ఇక 12వ ఓవర్ తొలి బంతికి ముహమ్మద్‌ ఆర్ఫాన్‌ బౌలింగ్‌లో ముహమ్మద్‌ రోహిద్‌ ఖాన్‌కు నమన్‌ క్యాచ్‌ ఇవ్వడంతో భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. కాగా వైభవ్‌, నమన్‌ రెండో వికెట్‌కు 57 బంతుల్లో 163 పరుగులు జోడించడం విశేషం. నమన్‌ స్థానంలో కెప్టెన్‌ జితేశ్‌ శర్మ నాలుగో నంబర్‌ బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చాడు.

తుఫాన్‌ ఇన్నింగ్స్‌కు తెర
కాగా 12.3 ఓవర్లో ముహమ్మద్‌ ఫరాజుద్దీన్‌ బౌలింగ్‌లో అహ్మద్‌ తారిక్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో వైభవ్‌ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొత్తంగా 41 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ 11 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 144 పరుగులు సాధించి.. మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా 13 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 199 పరుగుల వద్ద నిలిచింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.