టెండర్లు లేకుండానే రూ.772 కోట్ల సామగ్రి సరఫరా బాధ్యతలు
న్యాయ సమీక్ష నుంచి తప్పించుకునేందుకు టెండర్ల విభజన
విద్యార్థుల సంఖ్య కంటే అదనంగా 9.31 లక్షల కిట్లు కొనుగోలు
నాలుగేళ్లుగా మాయ చేసిన వైకాపా ప్రభుత్వం
బ్యాగులు చినిగిపోయినా చర్యల్లేవు
దీనికోసం 5% కమీషన్ దండుకున్న ఉత్తరాంధ్రలోని వైకాపా కీలక మంత్రి
వైకాపా ప్రభుత్వంలో విద్యా కానుక పేరుతో రూ.150 కోట్లు కొల్లగొట్టారు. విద్యార్థుల సంఖ్య కంటే అధికంగా కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపి సామగ్రి సరఫరా లేకుండానే నిధులు మింగేశారు. ఉత్తరాంధ్రకు చెందిన అప్పటి కీలక మంత్రి, ఆయన పేషీలోని పీఏ, కొందరు అధికారులు భారీగా ప్రజాధనానికి గండికొట్టినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఏడాది విద్యాకానుకకు ఎలాంటి టెండర్లు లేకుండా పాత గుత్తేదార్లకు సరఫరా బాధ్యతలు అప్పగించి, ముందుగానే డబ్బులు దండుకున్నట్లు విమర్శలున్నాయి. వైకాపా ప్రభుత్వంలో మంత్రి కీలకంగా ఉండడంతో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. నాణ్యతలేని బ్యాగ్‌లు సరఫరా చేసినా గుత్తేదార్లపై గానీ, అధికారులపై గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఈ బ్యాగ్‌లను సరఫరా చేసిన గుత్తేదార్లకు టెండర్లు లేకుండానే అప్పగించేశారు. ఏసీబీ లేదా విజిలెన్స్ విచారణ జరిపితే భారీగా అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
కమీషన్ల కోసం టెండర్లు లేకుండానే..
విద్యార్థులకు ఈ ఏడాది అందించే విద్యా కానుక సామగ్రికి టెండర్లు నిర్వహించకుండానే పాత గుత్తేదార్లకు రూ.772 కోట్ల విలువ చేసే కాంట్రాక్టును నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. కమీషన్ల కోసం పాతవారికే ఇచ్చేశారనే ఆరోపణలున్నాయి. ఈ ఏడాది ఎన్నికలు ఉంటాయని ముందే తెలుసు.. దీనికి అనుగుణంగా టెండర్లు నిర్వహించాలి. కానీ, ఉత్తరాంధ్ర మంత్రి, ఉన్నతాధికారి కలిసి పాత గుత్తేదార్లకు ఎలాంటి టెండర్లు లేకుండా ఇచ్చేశారు. పాఠశాలల్లో 36.54 లక్షల మంది విద్యార్థులు ఉంటే 39.51 లక్షల కిట్లకు ఆర్డర్లు ఇచ్చారు.
మార్కెట్‌లో ధరలు ఎలా ఉన్నాయో ముందే తెలుసుకోవాలి. ధరలు పెరిగితే పాత ధరకు, ధరలు తగ్గితే తగ్గిన ధరకే కాంట్రాక్టు ఇవ్వాలి. కానీ సమగ్ర శిక్షా అభియాన్ పట్టించుకోలేదు. పాత ధరల చొప్పున ఇచ్చేశారు.
మార్కెట్‌లో కాగితం ధర తగ్గినా ఒక్కో నోట్‌పుస్తకం రూ.52 చొప్పున పాత ధరకే ఇచ్చేశారు. గతేడాది ఇద్దరు గుత్తేదార్లు నోట్ పుస్తకాలను సరఫరా చేశారు. వీరిలో ఒకరు రాయలసీమకు చెందిన వైకాపా సానుభూతిపరుడు. ఈ ఏడాది ఆయనొక్కరికే మొత్తం కాంట్రాక్టును నామినేషన్ పద్ధతిపై ఇచ్చేశారు. ఇందుకు ప్రతిఫలంగా ఎన్నికల ముందు కీలక ప్రజాప్రతినిధికి రూ.6 కోట్లు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. నోట్‌పుస్తకాల కాగితం నాణ్యత లేకపోవడంతో ఒక గుత్తేదారును తప్పించినట్లు అధికారులు చెబుతున్నా తెర వెనుక చాలా తతంగం నడిచిందని విమర్శలున్నాయి.
నోట్‌పుస్తకాల్లో కాగితం నాణ్యత లేదని గుత్తేదారును తప్పించిన అధికారులు బ్యాగ్‌ల విషయంలో దీన్ని పాటించలేదు. 2023-24 విద్యా సంవత్సరంలో ప్రకాశం జిల్లాకు సరఫరా చేసిన బ్యాగ్‌లు రెండు, మూడు నెలల్లోనే చినిగిపోయాయి. అయినా ఆ గుత్తేదారుకే ఈ ఏడాది బ్యాగ్‌ల సరఫరా కాంట్రాక్టు అప్పగించారు.
వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలతో ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని, రూ.కోట్లలో ప్రజాధనం వృథా అయిందని రాష్ట్ర అడిట్ విభాగం సైతం 2023లో నిగ్గుతేల్చింది. రూ.100 కోట్లు దాటిన ఏ టెండరునైనా జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపాలన్నది నిబంధన. విద్యాకానుక టెండర్లను జోన్ల వారీగా విభజించి జ్యుడిషియల్ ప్రివ్యూ లేకుండా చేశారు.
విజిలెన్స్ తనిఖీల్లో బయటపడినా..
విద్యాకానుక-3లో భాగంగా సరఫరా చేసిన బ్యాగ్‌లు ఇచ్చిన మూడు నెలలకే చినిగిపోయాయి. అధికారుల లెక్కల ప్రకారం 47 లక్షల బ్యాగ్‌లు సరఫరా చేశారు. అందరి బ్యాగ్‌లు చినిగిపోయినా కేవలం 6 లక్షలు మార్పు చేసినట్లు చూపి.. గుత్తేదార్లు, అధికారులపై ఎలాంటి చర్యలు లేకుండా చేశారు. గుత్తేదార్ల నుంచి 5% కమీషన్ పిండుకున్న ఉత్తరాంధ్రకు చెందిన వైకాపా మంత్రి ఈ విషయంలో చక్రం తిప్పారు. బ్యాగ్‌ల పరిమాణం, నాణ్యతకు సంబంధించిన టెండర్ డాక్యుమెంట్‌ను మార్చేశారు. గుత్తేదారు నమూనాగా ఇచ్చిన బ్యాగ్‌లనూ మాయం చేశారు. బ్యాగ్‌ల నాణ్యతను నిర్ధారించిన సీపెట్ అధికారి ఒకరి హస్తం ఇందులో ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలొచ్చాయి. విద్యార్థులకు ఇచ్చిన బ్యాగ్‌లు చినిగిపోతే విచారణకు ఆదేశించకుండా ఉత్తరాంధ్ర మంత్రి, కొందరు అధికారులు మరింత ఎక్కువ కమీషన్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో నమూనాగా విజిలెన్స్ చేసిన తనిఖీల్లోనూ బ్యాగ్‌లు చినిగిపోయినట్లు బయటపడింది. కానీ వైకాపా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ గుత్తేదారులే కంపెనీల పేర్లు మార్చి, మళ్లీ బ్యాగ్‌లు సరఫరా చేస్తుండటం గమనార్హం.
ఈ దోపిడీకి సమాధానమేదీ?
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య కంటే అదనంగా విద్యాకానుక కిట్లు కొన్నట్లు లెక్కలు చూపి భారీగా ప్రజాధనానికి గండికొట్టారు. ఒక ఏడాది కిట్లు మిగిలితే వాటిని ఆ తర్వాత సంవత్సరం వినియోగించకుండా ఎప్పటికప్పుడు విద్యార్థుల సంఖ్య కంటే అదనంగా కొంటూనే వచ్చారు. మూడేళ్లలో 9,31,166 లక్షల కిట్లు అదనంగా కొనుగోలు చేశారు. ఒక్కో కిట్టుకు సరాసరిన రూ.1600 చొప్పున లెక్కించినా రూ.149 కోట్ల అవినీతి చోటుచేసుకుంది. ఇక మార్కెట్ ధరలు, టెండర్లలో నిర్ణయించిన ధరలను పోల్చి చూస్తే ఆ మొత్తం మరింత పెరుగుతుంది.
2021 అక్టోబరులో ప్రభుత్వ పాఠశాలల్లో 45.60 లక్షల మంది విద్యార్థులున్నట్లు లెక్కలు చూపారు. ఈ సంఖ్యపై 5% పెరుగుదలతో 2022-23 సంవత్సరానికి 47.88 లక్షల కిట్లు కొనేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. 45.14 లక్షల కిట్లకు టెండర్లు పిలిచారు. ఒక్కో కిట్టుకు రూ.1,565 చొప్పున ధర ఖరారు చేస్తూ రూ.960.48 కోట్లను అంచనా వ్యయంగా నిర్ణయించారు. విద్యార్థుల సంఖ్య 40.66 లక్షలకు పడిపోవడంతో నాలుగు లక్షలకు పైగా కిట్లు మిగిలిపోయాయి. వీటిని ఆ తర్వాత సంవత్సరం సైతం వినియోగించలేదు. వీటి విలువ రూ.70.13 కోట్లు.
2023-24 విద్యా సంవత్సరానికి కొత్త టెండర్లు పిలిచేటప్పుడు అంతకు ముందు ఏడాదిలో మిగిలిపోయిన నాలుగు లక్షల కిట్ల విషయాన్ని పట్టించుకోలేదు. ఈసారి కూడా విద్యార్థుల వాస్తవ సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా మరోసారి అంచనాలకు మించి 43.10 లక్షల కిట్లకు టెండర్లు పిలిచారు. సరఫరా 39.98 లక్షలే తీసుకున్నామని అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష సందర్భంగా విద్యా శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారమే ప్రభుత్వ బడుల్లో 36,54,539 మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కన 3.43 లక్షల కిట్లు మిగలాలి. వీటికీ ఇంతవరకు లెక్కల్లేవు. 2022-23, 2023-24 రెండేళ్లలోనే 7 లక్షలకు పైగా కిట్లు మిగలాలి. గుత్తేదార్ల నుంచి సామగ్రి తీసుకోకుండానే కమీషన్ల కోసం అదనంగా చెల్లించినట్లు ఆరోపణలున్నాయి.