ఆసుపత్రిలో మరణించిన వృద్ధుడిని అంత్యక్రియల కోసం అంబులెన్స్‌లో తరలిస్తుండగా.. అతడు తిరగబడి ప్రాణాలతో బయటపడ్డాడు. హర్యానాలో జరిగిన ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని దర్శన్ సింగ్ బ్రార్ (80)గా గుర్తించారు.
అతడు గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న దర్శన్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించడంతో అంబులెన్స్‌లో పాటియాలా నుంచి కర్నాల్‌లోని అతని ఇంటికి తీసుకుని బయలు దేరారు. ఆయనకు తోడుగా వస్తున్న దర్శన్ మనవడు తన తాత శరీరంలో కదలిక గమనించాడు. తర్వాత గుండె కొట్టుకోవడం గమనించి డ్రైవర్‌కు చెప్పాడు. అంబులెన్స్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు దర్శన్ బతికే ఉన్నట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
దర్శన్ చనిపోయాడని తాము చెప్పలేదని గతంలో దర్శన్‌కు చికిత్స అందించిన రీవల్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ నేత్రపాల్ వెల్లడించారు. తమ వద్దకు తీసుకువెళ్లే సరికి కొన ఊపిరి పీల్చుకోవడంతోపాటు బీపీతో బాధపడుతున్నట్లు తెలిపారు. సాంకేతిక లోపమో, మరేదైనా సమస్యతో మరో ఆసుపత్రిలో ఏం జరిగిందో తెలియడం లేదని వాపోయారు. అయితే ప్రస్తుతం ఆ వృద్ధిడి పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్స్ చెబుతున్నారు.