Viral: హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ జిల్లాలో సునీల్, శాంకీ అనే సోదరులు పెంచిన సోనీ అనే ఆవు 24 గంటల్లో 87.7 లీటర్ల పాలు ఇచ్చి ఆసియాలో రికార్డు సృష్టించింది.
మనలో చాలా మందికి ఇంట్లో ఆవులు, గేదెలు ఉండే ఉంటాయి. సిటీలో ఉన్నవారికి వీలు కాకపోవచ్చు గాని, గ్రామాల్లో అయితే ప్రతిఇంటికి కనీసం ఒక్కటైనా ఉంటుంది. మనకు తెలిసినంతవరకు అవి రోజుకు 4 నుంచి 6 లీటర్ల పాలు ఇస్తాయి. మరీ స్పెషల్ బ్రీడ్ అయితే 8 నుంచి 14 లీటర్లు అలా ఇస్తాయి. కానీ ఒక ఆవు ఒక్కరోజులోనే ఏకంగా 88 లీటర్ల పాలు ఇచ్చిందంటే నమ్ముతారా..?
అవును ఇది నిజమే. ఆవు కేవలం 24 గంటల వ్యవధిలో 87.7 లీటర్ల పాలను అందించింది. ఇన్ని పాలంటే ఏ బయటి దేశంలోని ఆవు అయి ఉండొచ్చు అనుకుంటున్నారా. కాదు ఈ ఆవు మన దేశానికి చెందినదే.
హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ జిల్లాలో ఈ ఆవు దర్శనమిచ్చింది. ఒక్కరోజు ఇన్ని పాలు ఇచ్చి.. ఆసియాలోనే ఒక్కరోజులో ఎక్కువ పాలు ఇచ్చిన ఆవుగా రికార్డు సృష్టించింది. ఈ ఆవును సునీల్, శాంకీ అనే ఇద్దరు సోదరులు పెంచుతున్నారు.
కర్నాల్‌లోని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన మేళాకు ఈ ఆవును తీసుకొచ్చారు. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు రైతులు హాజరయ్యారు. ఈ మేళాలో సునీల్, శాంకీకి చెందిన ఆవు 24 గంటల్లో 87.7లీటర్ల పాలు ఇచ్చి కొత్త రికార్డు సృష్టించింది.
ఈ ఆవు పేరు సోనీ. అది హోల్‌స్టెయిన్ ఫ్రైసియన్ (Holstein Friesian) జాతికి చెందింది. అయితే ఈ ఆవును పెంచుకునే సునీల్ ఆవు గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు. తమ కుటుంబం చాలా కాలంలో పశుపోషణ చేస్తోందని.. 2014 నుంచి రెండు పాడి పరిశ్రమలను నిర్వహిస్తున్నామని అన్నాడు.
అందులో దాదాపు 195 గోమాతలు ఉన్నాయని, ఆవులకు పాలను బట్టి ప్రత్యేక ఆహారం ఇస్తామన్నాడు. ఈ ఆవుకు 24 కిలోల సైలేజ్, 1.5 కేజీల గడ్డి, 10 కిలోల పచ్చి మేత, 20 కిలోల ప్రత్యేక దాణా అందిస్తున్నట్లు సునీల్ తెలిపారు.