Virat Kohli: నేను అబద్ధాలు చెప్పడం లేదు.. ఆ రోజు చాలా భయపడ్డా: విరాట్ కోహ్లీ

www.mannamweb.com


భారత స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20 ప్రపంచ కప్‌లో అత్యంత కీలక పాత్ర పోషిస్తాడని క్రికెట్ విశ్లేషకుల అంచనా. ఐపీఎల్‌లో భారీగా పరుగులు చేసి ఫామ్‌లో ఉన్న కోహ్లీ నుంచి మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌లు రావాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో తాను తొలిసారి వరల్డ్‌ కప్‌ (World Cup) ఆడినప్పటి సంగతులను ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. 2011 వన్డే ప్రపంచ కప్‌లో బంగ్లాతో ఆడిన మ్యాచ్‌ మొదటిది కావడం విశేషం. అందులో కోహ్లీ 83 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు.

‘‘ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తోనే నా తొలి వరల్డ్‌ కప్‌ మ్యాచ్ ఆడా. ఆ సమయంలో చాలా ఆందోళనకు గురయ్యా. నిజంగా.. నేనేమీ అబద్ధాలు చెప్పడం లేదు. ద్వైపాక్షిక సిరీసుల్లో ఆడటం వేరు. మెగా టోర్నీల్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించడం వేరు. అప్పుడు జట్టులో నేను చిన్నవయసు క్రికెటర్‌ను. గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం రావడమే అద్భుతం. మ్యాచ్‌కుముందు రోజు కూడా ఆందోళనగానే ఉన్నా. ఇవన్నీ కూడా మంచి శకునాలే. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన ఆటతీరు ప్రదర్శిస్తే జట్టుకు చాలా ఉపయోగంగా ఉంటుంది. దాని కోసం మానసికంగా, శారీరకంగా సిద్ధమయ్యా. నా ప్రణాళికలను అమలు చేసేందుకు ఆ నెర్వస్‌నెస్‌ సాయపడిందని అనుకుంటా’’ అని కోహ్లీ తెలిపాడు.

విమర్శలను ఆటతోనే తిప్పికొడతాడు: డీకే
విరాట్ కోహ్లీపై ఆటపై ఏమైనా విమర్శలు చేస్తే తనకు ప్రాణహాని హెచ్చరికలు వచ్చాయని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలపై భారత వెటరన్ క్రికెటర్ దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik) స్పందిస్తూ.. ‘‘ఈ ఏడాది ఎలా ఉండాలనేది విరాట్ కోహ్లీ తన పుస్తకంలో ఆల్రెడీ రాసేసుకున్నాడు. ఇప్పటికే ప్రారంభించాడు. సైమన్‌ డౌల్‌ వంటి వాళ్లకు ధన్యవాదాలు. ఎందుకంటే కోహ్లీని ఎంత విమర్శిస్తే.. అతడిలోని అద్భుతమైన ఆట బయటకొస్తుంది. ఇలాంటివెన్నో అతడి కెరీర్‌లో చూశాం’’ అని కార్తిక్ తెలిపాడు.