దట్టమైన అడవుల్లో పాల ధారలా దూకుతున్న జలపాతాలు.. ఎంజాయ్ చేస్తున్న జనం

www.mannamweb.com


తెలంగాణ – ఛత్తీస్గడ్ సరిహద్దు ములుగు జిల్లా అడవుల్లో మరో అద్భుత జలపాతం బయట పడింది. కొండలపై నుండి పాల ధారలు జాలువారుతున్న ఆ జలపాతాల సందర్శకులను తెగ ఆకట్టుకుంటోంది. మంత్రముగ్ధులను చేస్తున్న ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పోటెత్తారు. సెలవుదినం కావడంతో జలపాతాలు మరింత సందడిగా మారాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి ఆ జలపాతాలలో సందర్శకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

తెలంగాణ నయాగరా బొగత జలపాతాలకు సమీపంలో మరో జలపాతం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దట్టమైన అడవుల్లో కనువిందు చేస్తున్న ఈ జలపాతాల సందర్శనకు జనం పోటెత్తుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మహితాపురం గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఈ జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. మహితాపురం జలపాతం వద్ద పర్యాటకులతో తెగ సందడిగా మారింది. ఈ మధ్య కురిసిన వర్షాలతో జలపాతానికి జలకళను సంతరించుకుంది.

జలపాతం సుమారు 120 అడుగుల ఎత్తైన కొండలపై నుండి పాల ధారలా కిందకు దూకుతుంది. మైమరపిస్తున్న ఈ జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఎటు చూసినా కొండలు, గుట్టలు.. దట్టమైన అడవి, పచ్చని చెట్ల నడుమ, ఎత్తైన కొండలపై నుండి జాలువారుతున్న ఈ జలపాతాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.

ఈ జలపాతానికి చేరుకోవాలంటే సుమారు రెండు కిలోమీటర్ల మేర అటవీ మార్గాన నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రకృతి అందాలను వీక్షిస్తూ జలపాతం వద్ద ఈత కొడుతూ కేరింతలతో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సెలవు దినం వచ్చిందంటే చాలు ఈ జలపాతాల మరింత సందడిగా మారుతోంది.