WCL2024: నేటి నుంచి వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ప్రపంచ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ లో ఆడతారు.
దిగ్గజ క్రికెటర్ల ఆట చూడాలనుకునే ఫ్యాన్స్ కి ఈ లీగ్ సరికొత్త వినోదాన్ని పంచబోతుంది. నేటి నుంచి జూలై (శనివారం) 13 వరకు లెజెండ్స్ లీగ్ జరగబోతుంది. తొలిసారి నిర్వహిస్తున్న ఈ పోటీలో మొత్తం 6 దేశాలు పాల్గొంటున్నాయి. ఇంగ్లండ్, ఇండియా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాకు చెందిన లెజెండ్స్ జట్లు 10 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీలో టైటిల్ కోసం పోటీపడనున్నాయి.
అయితే, అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జూలై 6వ తేదీన జరగనుంది. ఎడ్జ్ బాస్టన్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమివబోతుంది. భారత జట్టుకు యువరాజ్ కెప్టెన్సీగా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. పాకిస్థాన్ టీమ్ ను షాహిద్ ఆఫ్రిది లీడ్ చేయబోతున్నాడు. ప్రతి రోజు మధ్యాహ్నం 1 గంటకు ఒక మ్యాచ్.. సాయంత్రం 5 గంటలకు మరో మ్యాచ్ జరగనుంది. యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, కెవిన్ పీటర్సన్, బెన్ కట్టింగ్, షాన్ మార్ష్, ఇమ్రాన్ తాహిర్, డేల్ స్టెయిన్, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్, షాహిద్ అఫ్రిది, ఆరోన్ ఫించ్, బ్రెట్ లీ లాంటి మాజీ అంతర్జాతీయ క్రికెటర్ల ఫ్యాన్స్ ను అలరించడానికి రెడీ అయ్యారు.
ఇక, వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ మొత్తం 10 రోజుల పాటు 18 మ్యాచ్‌లు జరుగనున్నాయి. రౌండ్ రాబిన్ తరహాలో ఈ లీగ్ జరగనుంది. ప్రతి జట్టు మిగిలిన ఐదు జట్లతో ఒకసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లకు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్, నార్తాంప్టన్‌లోని కౌంటీ గ్రౌండ్ ఆతిధ్యమిస్తాయి. లీగ్ దశల్లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు శుక్రవారం (జూలై 12) సెమీ ఫైనల్‌లో తలపడనున్నాయి. శనివారం (జూలై 13) ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే, ఇవాళ తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ ఛాంపియన్స్ తో ఇండియా ఛాంపియన్స్ పోటీ పడనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది.