ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కు ఓ అరుదైన ప్రశంస దక్కింది. స్వరాష్ట్రంలో ఆయన తీసుకున్న ఓ నిర్ణయం ఏకంగా మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యురాలైన స్మృతీ మంథనను మెప్పించింది.
దీంతో ఆమె తాజాగా లోకేష్ పై ప్రశంసల జల్లు కురిపించారు. లోకేష్ తీసుకున్న ఆ నిర్ణయం ఇతర రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు సైతం స్ఫూర్తి నిస్తుందని స్మృతీ వ్యాఖ్యానించింది. దీంతో ఈ వీడియోను లోకేష్ తన ఎక్స్ అకౌంట్ లో పోస్టు చేశారు.
ఈ ఏడాది విశాఖలోని వీసీఏ-ఏడీసీఏ స్టేడియంలో ఓ స్టాండ్ కు మహిళా క్రికెటర్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అధ్యక్షుడిగా ఉన్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అమలు చేసింది. ఈ విషయం తెలిసి దేశంలో పలువురు మహిళా క్రికెటర్లు స్పందించారు. ఇందులో భాగంగా కర్నాటకకు చెందిన భారత మహిళా జట్టు ఓపెనర్ స్మృతీ మంథాన కూడా స్పందించింది. అయితే లోకేష్ ఇప్పుడు వరల్డ్ కప్ నేపథ్యంలో ఆ వీడియోను షేర్ చేసుకున్నారు.
ఈ ఏడాది ఆగస్టులో ‘రాండమ్ ఐడియా’అనే పేరుతో జరిగిన ఓ చర్చలో స్మృతి మంధాన తాను మహిళా క్రికెటర్ల పేరు మీద స్టాండ్‌లకు పేరు పెట్టడాన్ని ప్రస్తావించిందని లోకేష్ తెలిపారు. గత నెలలో, వైజాగ్ స్టేడియంలోని ఒక స్టాండ్‌ను లెజెండ్ మిథాలీ రాజ్‌కు అంకితం చేయడం ద్వారా తాము ఆ ఆలోచనను ఆచరణలోకి తెచ్చినట్లు వెల్లడించారు. క్రీడలలో మహిళలకు నిధులు సమకూర్చడానికి ,సాధికారత కల్పించడానికి తాము అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదంతా ఒక సాధారణ ఆలోచనతో ప్రారంభమవుతుందని నారా లోకేష్ తెలిపారు. ఇతర క్రికెట్ సంఘాలు కూడా తమ నిర్ణయాన్ని అమలు చేయాలని లోకేష్ కోరారు. అదే విషయాన్ని ఈ వీడియోలో స్మృతీ మంథన కూడా సూచించింది. దేశవ్యాప్తంగా ఉన్న స్టేడియాల్లో పురుష క్రికెటర్ల పేర్లే స్టాండ్లకు పెడుతున్నారని, కానీ ఏపీలో మాత్రమే విశాఖ స్టేడియానికి ఇలా మాజీ క్రికెటర్ జులన్ గోస్వామి పేరు పెట్టారని స్మృతీ తెలిపింది. ఈ విషయంలో లోకేష్ ను స్మృతీ ప్రశంసించింది. ఈ చర్చలో భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుతం కామెంటేటర్ గా ఉన్న మిథాలీ రాజ్ కూడా ఉన్నారు.
































