ఇంట్లో బరువైన వస్తువులు ఎక్కడ ఉండాలి.? వాస్తు ఏం చెబుతోందంటే

www.mannamweb.com


ఇల్లు నిర్మాణంలో వాస్తుకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఇంటి నిర్మాణం మొదలు పెట్టగానే వాస్తు పండితులను సంప్రదిస్తుంటారు.

నిపుణుల సూచనల మేరకే ఇంటిని నిర్మించుకుంటారు. అయితే వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని, ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో బరువైన వస్తువులను ఏర్పాటు చేసుకునే విషయంలో కచ్చితంగా కొన్ని వాస్తు నియమాలను పాటించాలని అంటున్నారు.

ఇంట్లో వస్తువులు సరైన దిశలో పెట్టకపోతే వాస్తు దోషం ఏర్పడుతుందని, ఇవి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయనిని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇంట్లో బరువైన వస్తువులను ఏర్పాటు చేసే విషయంలో కచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. ఫ్రిడ్జ్‌, బీరువా, డైనింగ్ టేబుల్ లాంటి బరువైన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు.

వీలైనంత వరకు ఈశాన్యం మూల ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. తూర్పు ఈశాన్యంలో, ఉత్తర ఈశాన్యంలో బరువైన వస్తువులను పెడితే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ఇక ఇంటికి మధ్యలో ఎలాంటి ఎలాంటి బరువైన వస్తువులను పెట్టకూడదు. చాలా మంది బాగా బరువున్న సోఫాలను, డైనింగ్ టేబుల్స్‌లో హాల్‌ మధ్యలో వేసుకుంటారు. అయితే వాస్తు ప్రకారం ఇది మంచిది కాదని చెబుతుంటారు.

నైరుతి దిశలోనే బరువైన వస్తువులను పెట్టాలని వాస్తు పండితులు చెబుతున్నారు. అందుకే బీరువాలను బెడ్‌ రూమ్‌లలో పెడుతుంటారు. సహజంగానే వాస్తు ప్రకారం బెడ్ రూమ్‌ నైరుతిలో ఉంటుందని తెలిసిందే. అందులోనూ దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి దిశలలో బరువైన వస్తువులను పెట్టుకోవాలి. ఈ ప్రదేశాలలో ఎంత బరువైన వస్తువులు పెడితే అంత మంచిదని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇక ఉత్తరం వైపున కానీ, ఇంటి టెర్రస్ పైన కానీ పొరపాటున కూడా బరువైన వస్తువులను పెట్టకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వెంటాడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. స్టోర్‌రూమ్‌లో సైతం ఈశాన్యంలో బరువులు లేకుండా చూసుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించారు.