స్కూళ్లకు సంక్రాంతి సెలవులు వచ్చేస్తున్నాయ్‌.. ఎప్పట్నుంచంటే?

తెలుగు వారికి సంక్రాంతి పండగ ఎంతో స్పెషల్. బంధువులు, కొడుకులు, కూతుళ్లు, కోడళ్లు, అల్లుళ్లు, మనవళ్లు.. ఇంటిళ్లిపాది జరుపుకునే పవిత్రమైన పండగ.


దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమయం ఇది. దక్షిణాయనంలో వచ్చే వర్షాలు, చలితో రోగాలు, వాతావరణ కల్లోలాలకు ముగింపు పలుకుతుంది ఉత్తరాయణం. ఉత్తరాయణంలో సూర్యుడు ప్రచండంగా వెలిగిపోతుంటాడు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలాన్ని మకర సంక్రమనణము అని కూడా అంటారు. ఇదే సంక్రాంతి పండగ జరుపుకునే కాలం. మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది. తెలుగు లోగిళ్లలో ముగ్గులు, గొబ్బెమ్మలు, బసవన్నలు, హరిదాసులు, కోడిపందేలు, భోగిమంటలతో శోభాయమానమైన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతాయి.

యేటా సంక్రాంతికి విద్యా సంస్థలకు భారీగా సెలవులు వస్తుంటాయి. అందుకే విద్యార్ధులు సంక్రాంతి సెలవుల కోసం ఎదురు చూస్తుంటారు. అలాగే ఈసారి కూడా స్కూళ్లకు కాస్త ఎక్కువగానే సెలవులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఈసారి సంక్రాంతి సెలవులు జనవరి 10, 2026వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 18, 2026వ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగనున్నాయి. అంటే మొత్తం 9 రోజులు సంక్రాంతి సెలవులు రానున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈ సెలువులు వర్తించనున్నాయి. తిరిగి జనవరి 19వ తేదీన పాఠశాలలు తెరచుకుంటాయి. ఇక తెలంగాణలో జనవరి 10 నుంచి 15వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలోనే ప్రకటన వెలువరించనున్నాయి.

సంక్రాంతి సెలవులకు సాధారణంగా పిల్లలు అమ్మమ్మ, నానమ్మల ఇంటికి వెళ్లి ఇంటిళ్లిపాది సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. అందుకే తల్లిదండ్రులు పక్కా ప్లాన్‌తో సొంతూళ్లకు వెళ్లడానికి ముందుగానే ట్రైన్‌, బస్సు టికెట్లు సైతం బుక్‌ చేసుకుంటున్నారు. భారీ సెలవుల నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ప్రత్యేకంగా సర్వీసులు నడుపుతున్నారు. సంక్రాంతి సెలవులు కాకుండా జనవరి 23 శుక్రవారం – వసంత పంచమి, సరస్వతి పూజ , సుభాష్ చంద్రబోస్ జయంతి, జనవరి 26 సోమవారం గణతంత్ర దినోత్సవం పండగలకు సైతం విద్యాసంస్థలకు సెలవులు రానున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.