ఎక్కడ నేతలు అక్కడే గప్ చిప్.

2024 ఎన్నికలు వైసీపీ పార్టీకి నిజమైన రాజకీయానికి అర్ధం చెప్పాయి. అధికారం అంటే బటన్ నొక్కడమో, ప్రతిపక్షాల గొంతు నొక్కడమో లేక అధికార పార్టీ నేతల నోటికి పని చెప్పడమో కాదు పాలనతో ప్రజల మనసు గెలవడం అనేది వైసీపీ కి స్పష్టంగా చెప్పారు ఏపీ ఓటర్లు.


రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమనేదే లేకుండా చేయడమే తమ ధ్యేయం అన్నట్టుగా రాజకీయం చేసిన వైసీపీ పార్టీకి అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసారు ఏపీ ప్రజలు. దీనితో గత ఐదేళ్ల తమ అరాచక పాలన ఏపీ ప్రజలను ఎంతగా క్షోభింపచేసిందో తెలుసుకున్న కొంతమంది వైసీపీ నేతలు మెల్లగా పార్టీ కండువాలు మార్చుకున్నారు.

ఆ అవకాశం లేని ఇంకొంతమంది వైసీపీ నేతలు గుట్టు చప్పుడు కాకుండా అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. మరికొంతమంది జగన్ భజన బృందం మాత్రం తమ ఉనికిని కాపాడుకోవడానికి, అధిష్టానం వద్ద మెప్పు పొందడానికి మీడియా ముందుకొచ్చి ప్రభుత్వ పెద్దల మీద అవాకులు చవాకులు పేలుస్తున్నారు.

అయితే వీరంతా కూడా తాము చేసే ప్రతి పని జగన్ దృష్టిలో పడడానికే అన్నట్టుగా జగన్ ఏపీలో ఉంటే మాత్రమే మీడియాలో దర్శనమిస్తున్నారు. లేకుంటే ఎక్కడ దొంగలు అక్కడే గప్ చిప్ అన్నట్టుగా సైలెంట్ అయిపోతున్నారు. జగన్ తన కుమార్తెల కోసం కోర్ట్ అనుమతితో లండన్ పర్యటనకు వెళ్లారు. అయితే జగన్ అటు ఫ్లయిట్ ఎక్కగానే ఇటు వైసీపీ నేతల గొంతులు మూగపోయాయి.

అంబటి రాంబాబు, రోజా, పేర్ని నాని, విజయ సాయి వంటి నేతలు ఇప్పటికి జగన్ ప్రాపకం కోసం అదే నోటి దూల రాజకీయం నడుపుతున్నారు. అయితే ఇప్పుడు జగన్ ఏపీలో లేకపోవడంతో వీరు తమ తిట్ల డ్యూటీకి కాస్త తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు. ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ అటు సోషల్ మీడియాలో కానీ ఈ సో కాల్డ్ వైసీపీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

అయితే వీరు తమ సైలెన్స్ ను బ్రేక్ చెయ్యాలి అంటే జగన్ తిరిగి ఏపీకి రావాల్సిందే అన్నమాట. సంక్రాంతి పండుగ తరువాత జగన్ నియోజకవర్గాల పర్యటన చేపడతాను అంటూ ప్రకటించడంతో వైసీపీ శ్రేణులంతా జగన్ పర్యటన కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అలాగే ఈ వైసీపీ నేతలు కూడా ఇక అప్పటి నుంచి జగన్ తమకప్పగించిన తిట్ల దండంకం డ్యూటీ ఎక్కి ప్రభుత్వ పెద్దల మీద అలుపెరుగని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక అప్పటి వరకు ఎక్కడ నేతలు అక్కడే గప్ చిప్.