ప్రస్తుత తరుణంలో మహిళలు నిత్యం ఎంతటి ఒత్తిడిని అనుభవిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటి పనులు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో వారు సతమతం అవుతున్నారు. ఇంట్లోని అందరి ఆరోగ్యం, బాగోగులను వారు చూస్తారు. కానీ తమ ఆరోగ్యం గురించి తామే పట్టించుకోరు. ఇక పనిచేసే మహిళలు అయితే ఓ వైపు కుటుంబాన్ని, మరోవైపు పని ఒత్తిడిని ఎదుర్కొంటూ అవస్థలు పడుతుంటారు. ఇలా ఒత్తిడి బారిన పడుతున్న మహిళలు చాలా త్వరగా వృద్ధాప్యంలోకి వచ్చేసినట్లు కనిపిస్తారు. 30 లేదా 40 ఏళ్ల వయస్సులోనే వృద్ధులు అయిపోయినట్లు కనిపిస్తారు. అయితే కొన్ని రకాల ఆహారాలను తరచూ తీసుకుంటే ఒత్తిడి తగ్గడంతోపాటు చర్మం యవ్వనంగా కనిపించేలా చేయవచ్చు. దీంతో వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. వయస్సు మీద పడినా కూడా యవ్వనంగానే కనిపిస్తారు. ఇక మహిళలు యవ్వనంగా కనిపించాలంటే తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు, పెరుగు..
మహిళలు రోజూ పాలను తాగుతుండాలి. పాలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అయితే కొవ్వు శాతం తక్కువగా ఉండే పాలనే తాగాల్సి ఉంటుంది. పాలలో ఎముకలను బలంగా ఉంచే క్యాల్షియం, విటమిన్ డి, విటమిస్ సి అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి స్త్రీలకు పోషణను అందిస్తాయి. చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. అలాగే కొవ్వు తక్కువగా ఉండే పెరుగును కూడా స్త్రీలు తీసుకోవాలి. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇలాంటి పెరుగును తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా పెరుగు ఎంతగానో మేలు చేస్తుంది. స్త్రీలకు వచ్చే కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లు, అల్సర్లను కూడా పెరుగు తగ్గిస్తుంది. చర్మాన్ని సంరక్షించడంతోపాటు యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
టమాటా, సోయా..
స్త్రీలకు టమాటాలు ఔషధంతో సమానం అనే చెప్పాలి. ఎందుకంటే వీటిల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగిస్తుంది. ఈ విషయాన్ని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలే వెల్లడిస్తున్నాయి. టమాటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మహిళల్లో వచ్చే గుండె జబ్బుల ప్రమాదాన్ని సైతం తగ్గిస్తాయి. టమాటాలను తరచూ తినడం వల్ల ఎంత వయస్సు వచ్చినా కూడా యవ్వనంగానే కనిపిస్తారు. ఎందుకంటే ఇవి చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషకాలు పుష్కలంగా ఉండే సోయాను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. సోయాలో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి స్త్రీలను అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి.
డ్రై ఫ్రూట్స్, బెర్రీలు..
రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్‌ను తినడం వల్ల శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. అందుకే వీటిని స్త్రీలు తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో విటమిన్ బి12, విటమిన్ ఇ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. రోజూ డ్రై ఫ్రూట్స్‌ను తింటే బలంగా ఉంటారు. బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, రాస్ప్ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, క్రాన్ బెర్రీలను రోజూ తింటే స్త్రీలు ఎలాంటి రోగాల బారిన పడే అవకాశమే రాదంటారు నిపుణులు. ఎందుకంటే వీఇలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. ఎందుకంటే వీటిలో క్యాన్సర్‌తో పోరాడే ఔషధ గుణాలు ఉంటాయి. ఇలా పలు రకాల ఆహారాలను మహిళలు తీసుకోవడం వల్ల అనేక పోషకాలను పొందడంతోపాటు చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుకోవచ్చు. అలాగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.