సంక్రాంతి పండుగ ముఖ్యంగా తెలుగువారు ఘనంగా జరుపుకునే పండుగ. అటువంటి సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నగరం అంతా ఖాళీ అయ్యింది. హైదరాబాద్ నుండి ఏపీకి లక్షల మంది తరలివెళ్ళారు.
దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి NH-65 ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడింది. నేషనల్ హైవే పై ట్రాఫిక్ సమస్య కూడా చోటు చేసుకుంది.
నేషనల్ హైవేపై పండుగ రద్దీ
గత ఐదు రోజులుగా ఈ మార్గంలో అసాధారణ రద్దీ కొనసాగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద చేసిన గణాంకాల ప్రకారం, ఐదు రోజుల వ్యవధిలోనే రెండువైపులా కలిపి మొత్తం 3.04 లక్షల వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగించాయి. ఈ వాహనాల్లో దాదాపు 2.04 లక్షలు హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్లిన వాహనాలే కావటం గమనార్హం.
పంతంగి టోల్ ప్లాజా లెక్కల ప్రకారం రద్దీ ఇలా
అత్యధికంగా, శనివారం ఒక్కరోజే 71,284 వాహనాలు పంతంగి టోల్‌ప్లాజాను దాటాయని లెక్కలు చెప్తున్నాయి. ఇక శుక్రవారం 53 వేల వాహనాలు, ఆదివారం 62 వేల వాహనాలు, సోమవారం 56 వేల వాహనాలు, మంగళవారం 62 వేల వాహనాలు పంతంగి టోల్ ప్లాజా మీదుగా రాకపోకలు సాగించాయి. ఇక బుధవారం నాడు భోగి కావటంతో రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే, ఈసారి ప్రయాణికుల రాకపోకలు విపరీతంగా పెరిగాయి.
ఈ ఏడాది మూడు లక్షలు దాటిన వాహన రాకపోకలు
గతేడాది మూడు రోజుల ముందు 2.07 లక్షల వాహనాలు ప్రయాణించగా, ఈసారి ఆ సంఖ్య 3 లక్షలు దాటడం విశేషంగా చెప్పొచ్చు. అయితే రద్దీని దృష్టిలో పెట్టుకుని టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయటం, ఫాస్టాగ్ స్కానింగ్ వేగవంతం చేయటం వంటి చర్యలతో రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ పెద్దగా ట్రాఫిక్ జామ్ లు కాకుండా ప్రయాణాలు చేసేలా చూశారు.
విజయవాడ హైవేపై అభివృద్ధి పనులు, ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణాలు
ఇక విజయవాడ హైవేపైన అభివృద్ధి పనులు జరుగుతున్న దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలలో కూడా ప్రజలు ప్రయాణాలు చేయటం కాస్త ట్రాఫిక్ రద్దీని తగ్గించింది. గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వెళ్లేవారు సాగర్ హైవే మీదుగా వెళ్ళారు. ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లేవారు భువనగిరి-చిట్యాల మార్గం గుండా ప్రయాణించారు.
సంక్రాంతికి విజయవాడ నేషనల్ హైవేపై రికార్డు స్థాయిలో వాహనాలు
ఈ ప్రత్యామ్నాయ మార్గాల ఎంపిక కూడా పంతంగి టోల్‌ప్లాజా వద్ద రద్దీని బాగా తగ్గించింది. లక్షలాది వాహనాలు ప్రయాణించినా, పెద్దగా అంతరాయం లేకుండా ట్రాఫిక్ సజావుగా సాగింది.గతేడాదితో పోలిస్తే రికార్డు స్థాయిలో వాహనాలు సంక్రాంతికి విజయవాడ నేషనల్ హైవేపై ప్రయాణాలు సాగించాయి.



































