ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. కేంద్ర ప్రభుత్వం నుంచి హెచ్చరిక..

www.mannamweb.com


బ్యాంకుల పేరిట ఫేక్ మెసేజ్ లు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. సాధారణంగా బ్యాంకులు తమ ఖాతాదారుల్లో ఇటువంటి స్కామ్ లపై అవగాహన కల్పించేందుకు వినియోగదారులకు కొన్ని మెసేజ్ లు పంపిస్తుంటాయి. ఎటువంటి లింక్స్ ఓపెన్ చేయొద్దు.. మీ పిన్, సీవీవీ వంటి ఎవరికీ చెప్పొద్దు.. అనే మెసేజ్ లు మన ఫోన్ లో చూసే ఉంటాం. ఇప్పుడు ఇలాంటి మెసేజ్ లను కూడా నేరగాళ్లు కాపీ చేస్తున్నారు. ఫేక్ మెసేజ్లు చేస్తూ ఖాతాలను లూటీ చేస్తున్నారు. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఓ కీలకమైన ప్రకటనను చేసింది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వినియోగదారులను ఈ మోసపూరిత సందేశాలపై అప్రమత్తం చేసింది. రివార్డు పాయింట్లను రిడీమ్ చేసుకోడానికి కస్టమర్లకు ఏపీకే ఫైల్స్ ను పంపుతూ..దానిని ఇన్ స్టాల్ చేసుకోమని చెబుతున్నారని హెచ్చరించింది. ఆ ఏపీకేని ఇన్ స్టాల్ చేస్తే నేరగాళ్లు సులభంగా మీ ఖాతాలను కొల్లగొట్టేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రివార్డు పాయింట్ల పేరుతో..

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కస్టమర్లకు చేసిన హెచ్చరిక ప్రకారం.. రివార్డు పాయింట్లను రిడీమ్ చేసుకోడానికి వినియోగదారులకు ఏపీకే ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకోమని చెబుతూ ఎస్బీఐ నుంచి వచ్చినట్లుగా ఆ మెసేజ్ ఉంటుంది. అయితే ఆ మెసేజ్ ఫేక్. ఎస్బీఐ ఎప్పుడూ ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా లింక్లు లేదా ఏపీకే ఫైళ్లను పంపదు. ఒకవేళ మీరు అలాంటి మెసేజ్ స్వీకరిస్తే.. ఇది సైబర్ నేరగాళ్ల పనిగా గుర్తించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫైళ్లను డౌన్ లోడ్ చేసుకోకూడదు. ఒకవేళ మీకు అలాంటి మెసేజ్ వచ్చి.. దానిని అనుమానిస్తే.. వెంటనే ఎస్బీఐ అధికారిక చానళ్లలో తనిఖీ చేసుకోవాలి. అలాగే మెసేజ్ తో పాటు వ్యక్తిగత సమాచారాన్ని అడిగినా.. అవతలి వారి ప్రామాణికతను ధ్రువీకరించుకోవాలి. వినియోగదారుల అప్రమత్తత, జాగ్రత్తలే మోసపోకుండా కాపాడుతుందని పీఐబీ పేర్కొంది.
సైబర్ నేరగాళ్లు పంపే మెసేజ్ లు ఇలా ఉంటాయ్..

డియర్ వాల్యూ కస్టమర్..

‘మీ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ రివార్డు పాయింట్లు(రూ. 9980.00)నేటితో ఎక్స్ పైర్ అవుతాయి!ఇప్పుడు ఎస్బీఐ రివార్డు యాప్ ద్వారా రిడీమ్ చేసుకోండి. మీ ఖతాలో నగదు డిపాజిట్ చేయడం ద్వారా మీ రివార్డును క్లెయిమ్ చేసుకోండి. మీ రివార్డును క్లెయిమ్ చేసుకొని, ఏపీకే ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకోండి.’ ఇలాంటి మెసేజ్ గానీ మీరూ స్వీకరిస్తే.. వెంటనే అప్రమత్తం కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లింక్స్ పై క్లిక్ చేయకూడదు.

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

మీకు మెసేజ్ పంపిన వారు ప్రామాణికతను ధ్రువీకరించుకోండి.
ఆ మెసేజ్ బ్యాంక్ అధికారిక కమ్యూనికేషన్ల విధానాల నుంచే వచ్చిందా లేదా అన్నది తనిఖీ చేసుకోండి.
మెసేజ్ రూపంలో వచ్చిన లింక్స్, లేదా మీకు తెలియని లింక్స్ క్లిక్ చేయడం.. అటాచ్ మెంట్లను డౌన్ లోడ్ చేసుకోవడం వంటివి చేయకండి.
మీకు అనుమానిత మెసేజ్ వస్తే.. మీ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ నుంచి కాంటాక్ట్ వివరాలు ఉపయోగించి సంస్థను సంప్రదించండి. లేదా కస్టమర్ కేర్ నంబర్ కు కాల్ చేయండి.
బ్యాంక్ అధికారిక యాప్ లేదా వెబ్ సైట్ల నుంచి మాత్రమే లావాదేవీలు నిర్వహించండి. మీ ఖాతాను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోండి.
మీ ఖాతా లాగిన్ వివరాలను ఎప్పుడూ వేరే వ్యక్తితో పంచుకోవద్దు. పంచుకోవాల్సి వస్తే జాగ్రత్తలు పాటించండి.. ఈ-మెయిల్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా వంటి వాటి ద్వారా అస్సలు షేర్ చేయొద్దు.
ఏదైనా అనుమానాస్పద మెసేజ్లు లేదా ఫిషింగ్ లింక్స్ మీకు వస్తే.. వెంటనే బ్యాంక్ నకు తెలియజేయండి.