సెంటినెలిస్- దాదాపు 60,000 సంవత్సరాల నుంచీ ఈ అండమాన్ దీవుల్లో నివసిస్తున్న ఆదిమ వాసులు – సెంటినలీస్‌ను కలవటం నేరం , వారిని ఫొటోలు, వీడియోలు తీయటం నిషిద్ధం – ఇప్పటికి లోహాల గురించి పెద్దగా తెలియదు- ఇప్పటివరకు సెంటినెలీస్ తెగ వారిని ఎవరూ కలవలేదా? బాహ్య ప్రపంచంతో సంబంధాలు నెరపడానికి ఎందుకు ఆస్తకి కనబర్చరు? అదో పెద్ద కథ.తెలుసుకుందాం…..
చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన నరజాతి మనుషులు కొందరు ఇంకా అలాగే ఉండిపోయారు. కొంత మానవాభివృద్ధి తరవాత పరిణామ క్రమం ఆగిపోయి ఉండటంతో అడవిజాతిగానే మిగిలిపోయారు. రాతియుగం నాటి మనుషులు ఎలా ఉంటారు. జంతువులను వేటాడి పచ్చి మాంసం తింటారు. అడవుల్లో ఉంటారు. పశు ప్రవర్తన. ఒంటి మీద బట్టలు వేసుకోవడం తెలీదు. ఆకలేస్తే వేటాడి తినడం, నిద్రవస్తే నిద్రించటం, దేహం కోరుకుంటే మైధునం అంతకు మించిన ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, బావోద్వేగాలు అసలే వారికి తెలయవు లేదా ఉండవు.
పూర్తి అడవి కౄరమృగాల తరహా జీవనం. ఇలాంటి మనుషులు ఇప్పటికీ ఉన్నారంటే నమ్మగలరా? ఏవరైనా? నమ్మకాలకు అపనమ్మకాలకు సంభంధం లేకుండా వారి ప్రవర్తన అలాగే ఉంటుంది. మన అండమాన్ నికోబార్ దీవుల్లోని ఉత్తర సెంటినల్ ఐలాండ్ ప్రాంతంలో ఉండే “సెంటినల్ తెగ ప్రపంచం లోనే అత్యంత కౄరమైన ప్రమాదకరమైన మానవరూప ఆదిమజాతి.
అండమాన్‌లోని రక్షిత ఆదిమ వాసులు అయిన ‘సెంటినెలీస్’ తెగ ప్రజలను కలుసుకోవడానికి వెళ్లిన 27 ఏళ్ల అమెరికన్ జాన్ అలెన్ చౌ వారి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ దీవుల్లోకి వెళ్లాలని ప్రయత్నించిన జాన్ ను అక్కడి ప్రజలు 2018 నవంబర్ 16న బాణాలు వేసి హతమార్చారు.
తీర ప్రాంతం లో గస్తీ తిరుగుతున్న సెంటినెలిస్ |
2004లో ఇండొనేసియా, శ్రీలంక, భారత తూర్పు తీరాల్లో మహావిలయం సృష్టించిన హిందూ మహా సముద్ర సునామీని.. నార్త్ సెంటినల్ దీవిలో నివసించే ఈ సెంటినలీస్ తెగవారు తట్టుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నారని ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పుడ, నార్త్ సెంటినల్ దీవి మీదుగా నేవీ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ పరిశీలించారు. మరింత దగ్గరగా చూడటానికి హెలికాప్టర్ కాస్త కిందకు దిగినపుడు.. దానిపై అక్కడి తెగ వారు బాణాలు విసిరిరారు. ”అలా వారు క్షేమంగా ఉన్నారని మాకు తెలిసింది” అని ఆ హెలికాప్టర్ పైలట్ మీడియాకు చెప్పారు.
హెలికాప్టర్ పైకి బాణాలు వేస్తున్న సెంటినెలీస్ |
దీంతో 2004లో సునామీ సంభవించండంతో మొదటిసారి వెలుగులోకి వచ్చిన ఈ తెగ గురించి చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. మరి ఈ తెగవారు ఇతరులను ఎందుకు తమ ప్రాంతంలోకి అనుమతించరు? బాహ్య ప్రపంచంతో సంబంధాలు నెరపడానికి ఎందుకు ఆస్తకి కనబర్చరు? అదో పెద్ద కథ.తెలుసుకుందాం…
ఎవరీ సెంటినెలీస్?
బంగాళాఖాతంలోని అండమాన్ దీవుల్లో ఒకటైన ఉత్తర సెంటినెల్ ఐలాండ్‌లో నివసించే ఒక ప్రత్యేకమైన తెగ సెంటినెలీస్. ఇండియా లో ఉన్న మనల్ని ఇండియన్స్ అన్నట్లే అక్కడి వారిని సెంటినెలీస్ అంటారు .
వీరు.. ఆఫ్రికాలో ఆవిర్భవించిన మొట్టమొదటి మానవ జనాభా ప్రత్యక్ష వారసులు కావచ్చునని.. దాదాపు 60,000 సంవత్సరాల నుంచీ ఈ అండమాన్ దీవుల్లో నివసిస్తున్నారని పరిగణిస్తున్నారు.
అండమాన్ దీవుల్లోని ఇతర దీవుల్లో ఉన్న వేరే ఆదిమజాతుల వారి భాషకూ.. ఈ సెంటినలీస్ భాషకూ ఏమాత్రం పోలిక లేకపోవటాన్ని బట్టి.. వీరికి తమ చుట్టుపక్కల దీవుల్లోని జాతుల వారితోనే వేల ఏళ్లుగా సంబంధాలు లేవని అర్థమవుతోంది.
ఇతర గిరిజన తెగలకు భిన్నంగా ఉండే సెంటినెలీస్ భాష మాట్లాడే వీరు బయటివారిని బద్ధ శత్రువులుగా చూస్తారు. వీరి జనాభా 15 నుంచి 500 మధ్య ఉంటుందని అంచనా. క్రమంగా తగ్గుతూ అది కాస్త 100 లోపు పడిపోయిందని అంటున్నారు. అయితే 2001 జనాభా లెక్కల ప్రకారం 21 మంది పురుషులు, 18 మంది స్ర్తీలున్నారు. 2011 లెక్కల ప్రకారం 12 మంది పురుషులు ముగ్గురు మహిళలు ఉన్నారు.
సెంటినలీస్‌ను కలవటం నేరం , వారిని ఫొటోలు, వీడియోలు తీయటం నిషిద్ధం
ప్రపంచానికి దూరంగా ఏకాంతంలో జీవిస్తున్న అండమాన్ తెగలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఆ తెగ వారిని కలవటం నేరం. బయటి వ్యాధులు ఆ తెగవారికి సోకే ప్రమాదాన్ని నివారించటానికి.. వారిని ఎవరూ కలవరాదన్న నిషేధం విధించారు.
అండమాన్ ఆదివాసీ తెగల వారిని ఫొటోలు, వీడియోలు తీయటం కూడా.. మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించగల నేరమని భారత ప్రభుత్వం 2017లో ప్రకటించింది.
జీవనాధారం ఏంటి?
సెంటినెలీస్ తెగల ప్రధాన ఆహారం చేపలు, పీతలు మరియు కొబ్బరి ఉత్పత్తులు. వీటితో పాటు అడవి జంతువులను వేటాడుతారు. వీరి ఆహార సేకరణ, ఉత్పత్తి అంతా అండమాన్‌లోని ఓంగే (Onge) తెగ ప్రజలకు దగ్గరగా ఉంటుంది. వీరు అంతరించిపోయే దశలో ఉన్నందున వీరి జనాభా కూడా చాలా తక్కువగానే వృద్ధి చెందుతుంది. రాతి యుగం కాలం దాటి తాము అభివృద్ధి చెందలేదని వీరు బలంగా విశ్వసిస్తారు. లోహాల గురించి పెద్దగా తెలియదు. వ్యవసాయం రాదు. కానీ 1974లో National Geographic Society వారు జారవిడిచిన అల్యూమినియం తో చేసిన కొన్ని వస్తువులను మొదటిసారి వీరు తీసుకొని ఆయుధాలు చేసుకున్నారని అంటారు
ఆచారాలు, భాష ఏంటి?
నలుపు రంగులో ఉండి ఎప్పుడూ నడుముకి మాత్రమే గుడ్డ కట్టుకొని తిరుగుతారు. మహిళలు నడుము, మెడ, తలకు నార దారాలు కట్టుకొని తిరుగుతుంటారు. బయటి ప్రపంచంతో సంబంధాలు లేకపోవడం వల్ల ఈ తెగలో అక్షరాస్యత శూన్యం. ఈ తెగవారు మాట్లాడే భాష సెంటినెలీస్. 1980లో ఒకసారి వీరిని కలిసిన పరిశోధకులు వారి భాష ఓంగె లాంగ్వేజ్‌కు దగ్గరగా లేదని ఇది ప్రపంచంలో ఎవరికీ తెలిసే అవకాశ లేదని వెల్లడించారు. 2006లో వీరు మత్స్యకారులను చంపి మృతదేహాలను పాతిపెట్టిన విధానంతో వీరు నరమాంస భక్షకులు కాదని పరిశోధకులు తేల్చారు.
అండమాన్‌లో ఉండే ఇతర తెగలేంటి?
ప్రపంచంలో ఏ మూలన చూసినా చాలా ప్రత్యేకతలు కలిగిన ఆదిమ, గిరిజన తెగలుంటాయి. ఇవి భౌగోళికంగా ఏకాంతావాసాల్లో లేదా నాగరిక సమాజానికి దూరంగా అడవులు, దీవుల్లో విశిష్టత కలిగిన సంస్కృతితో బయటి వ్యక్తులను కలవడానికి ఇష్టపడకుండా నివసిస్తూ ఉంటాయి. సాధారణంగా జంతువుల వేట, అటవీ ఉత్పత్తుల వీరి జీవనాధారం. బంగాళాఖాతంలో విసిరేసినట్లుగా ఉండే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో కూడా మొత్తం 5 తెగలు అంతరించిపోయే దశలో ఉన్నాయని ఆంత్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు తేల్చారు. అవి గ్రేట్ అండమానీస్, జరవాస్, ఓంగేస్, సెంటినెలీస్, షార్నపెన్స్ అనే తెగలు.
ఇప్పటివరకు సెంటినెలీస్ తెగ వారిని ఎవరూ కలవలేదా?
సెంటినెలిస్ తెగవారు తమ ద్వీపంలోకి అడుగుపెడితే, బాణాలతో కొట్టి చంపేస్తారు. గతంలో ఇలా జరిగిన సంఘటనలున్నాయి కూడా.
1896లో ఒకసారి అండమాన్ జైలు నుంచి తప్పించుకున్న ఒక ఖైదీని వెతుక్కుంటూ పోలీసులు పడవల్లో ఈ దీవి చేరారు. ఈ తెగ ప్రజల గురించి అప్పటిదాకా బాహ్య ప్రపంచానికి తెలియకపోవటంతో సాధారణంగా దీవిలో అడుగు పెట్టడంతో పోలీసులపైకి ఒక్కసారిగా బాణాలు రయ్, రయ్ మంటూ దూసుకొచ్చాయి. వారికి ఏం జరుగు తుందో తెలిసే లోగానే వారి శరీరాలను శరపరంపర జల్లెడ చేసేశాయి. ఆ భయానక తెగ ఉనికి గురించి తెలిసింది ఆనాడే. అప్పటి నుండి ఆ దీవి సమీపానికి మాత్రమే గాదు ఆ దిశగా వెళ్లడానికి ఎవరూ సాహసం చేయలేదు.
ఈ సెంటినల్ తెగ ఉనికి 1974 లో మరోసారి బయటపడింది. ఒక సినిమా బృందం షూటింగ్ నిమిత్తం సెంటినల్ దీవి సమీపంలోకి వెళ్లింది. వారిపై ఒక్కసారిగా బాణాలతో దాడి చేశారు. దీంతో వాళ్లంతా భయంతో పడవలెక్కి వెనక్కి వచ్చేశారు. సినిమా బృందానికి జరిగిన అనుభవం తర్వాత, వారిపై మానవ పరిణామ శాస్త్రవేత్తలు ఇతరులు పరిశోధనలు చేయడానికి ప్రభుత్వం ఒక బృందాన్ని అనుమతించింది. వారిని కూడా తెగ ప్రజలు భయపెట్టడంతో, ఆపై దీవిలోకి ఎవరూ వెళ్లొద్దని ప్రభుత్వం నిషేధం విధించింది.
మన ఇండియన్ ఆంథ్రోపాలజిస్టు త్రిలోక్‌నాథ్ పండిట్ 1967 జనవరిలో ద్వీపంలోకి వెళ్లి, బయటికి రాగలిగాడు అని చెప్పుకుంటారు.
ఆ అనుభవం అయన మాటల్లోనే.. ఆంత్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ప్రాంతీయ కేంద్రం కు నేను అప్పుడు ఇన్‌చార్జ్‌గా ఉన్నాను. దాదాపు 20 మంది నేవీ, పోలీసులు, అధికారులతో కలిసి ఆ దీవిలోకి వెళ్లాం. అయితే ఎవరూ కన్పించలేదు. పాదాల గుర్తులను పట్టుకొని ఒక కి.మీ. దూరం వెళ్లాక 18 గుడిసెలు, చేపల ఆహారం, అటవీ పండ్లు వంటివి కనిపించాయి. గుడిసెల్లో ఎవరూ లేరు. కానీ అక్కడ 80 – 100 మంది వరకు ఉంటుందని మా అంచనా. వాళ్లు పొదల్లో దాగి ఉండొచ్చు అనుకున్నాం. మమ్మల్ని ఎవరూ చుట్టుముట్టలేదు. అయినా వాళ్లను కలవకుండానే వెనుదిరిగాం. 1970, 80 ల్లో కూడా రెండు మూడు సార్లు ఆ దీవికి వెళ్లాం. అప్పుడు వారు చాలా మంది వచ్చి మమ్మల్ని ఆపడానికి ప్రయత్నించారు. దగ్గరకు రావద్దంటూ వార్నింగ్ ఇచ్చినట్లే ఇస్తూ ఏవో సైగలతో హేళన చేశారని 83 ఏళ్ల పండిట్ ఎకనామిక్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన అనుభవాలను పంచుకున్నారు.
‘క్రైస్తవ మత ప్రచారకుడు జాన్ ని చంపిన అండమాన్ సెంటనలీస్ ఆదిమజాతి ప్రజలు’
అసలీ … జాన్ ఎవరు?
అండమాన్ నికోబార్ దీవులను సందర్శించాలి. అక్కడ చూడవల్సింది, చేయవల్సింది ఎంతో ఉంది. – 2015లో ఓ ఇంటర్వ్యూలో జాన్ అలెన్ చౌ
జాన్ అలెన్ చౌ |
అమెరికాకు చెందిన క్రైస్తవ మిషనరీ, మత బోధకుడు జాన్ అలెన్ చౌ.. ఆ ద్వీపంలోని వాళ్లను కలిసి, వారిని తన మతంలోకి మార్చాలని అనుకున్నాడు. హైస్కూల్ రోజుల నుంచే అతనికి ఈ కోరిక ఉండేదని ‘కోవెనెంట్ జర్నీ’ సంస్థ ఛైర్మన్ మ్యాట్ స్టేవర్ తెలిపారు. ఈ దీవిపై ‘నిషిద్ధ ప్రాంత అనుమతి’ (ఆర్‌ఏపీ)ని ఈ ఏడాది ఉపసంహరించినప్పటికీ అధికారుల నుంచి విదేశీయులు అనుమతి తీసుకోవాల్సి ఉండగా జాన్ అనుమతి తీసుకోకుండానే అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించి మృత్యువాత పడ్డాడు. సెంటినెలిస్ తెగ బాణాలకు బలైన అమెరికా పర్యాటకుడు జాన్ అలెన్ గురించి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.
మత్స్యకారుల కథనం..
దీవిలోకి వెళ్లడానికి జాన్ నవంబర్ 14న విఫలయత్నం చేశాడు. 15వ తేదీ మత్స్యకారులకు 25 వేల రూపాయలు చెల్లించి మళ్లీ పయనమయ్యాడు. వారు జాన్‌ను చిదియాతాపు ప్రాంతం నుంచి వారి పడవలో సెంటినెల్ దీవి సమీపం వరకు తీసుకెళ్లారు. మత్స్యకారులకు ఆ ద్వీపంలోకి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి వారు పడవ దిగకుండా వెనుదిరిగారు. అక్కడి నుంచి మడతపెట్టే వీలున్న ఒక చిన్న పడవలో తెల్లవారు జామున 4.30 సమయంలో జాన్ ఆ దీవి తీరానికి చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో దూరం నుంచే ఈ విషయాన్ని గమనించిన మత్య్సకారుల కథనం ఇలా ఉంది. ‘జాన్ దీవిలో దిగి దిగగానే ఆదిమ వాసులకు ఫుట్‌బాల్, ప్లేయింగ్ రింగ్, చేపలు, కత్తెర, వైద్య కిట్ వంటివి ఇవ్వబోయారు. ఈ లోగా ఓ వ్యక్తి ఆయనపై బాణంతో దాడి చేశాడు. వెంటనే అతనిపై బాణాలు వర్షం కురిసింది. అయినప్పటికీ ఆయన అలానే కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలారు. 17న ఉదయం 6.30 సమయంలో కొందరు ఆటవికులు జాన్ మృతదేహాన్ని ఈడ్చుకొచ్చి, తీరం వద్ద సగం మేర ఇసుకలో పూడ్చిపెట్టడాన్ని తాము చూశామని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే జాన్‌ను రెండు రోజులు బందీగా ఉంచుకొన్నట్లు తెలుస్తోంది. మరుసటి రోజు చూసినప్పుడు కూడా జాన్ మృతదేహం అక్కడే ఉందన్నారు. పోర్ట్‌బ్లెయిర్‌కు తిరిగొచ్చిన మత్య్సకారులు ఈ ఘటనను జాన్ మిత్రుడైన స్థానిక మతబోధకుడు అలెక్స్ కు తెలపగా ఆయన అమెరికాలోని జాన్ కుటుంబానికి ఈ విషయాన్ని తెలియజేశారు.
మరో కథనం ఇది
ఇంకో కథనం ప్రకారం జాన్ నవంబర్ 14న ఉత్తర సెంటినెల్ దీవికి వెళ్లారు. ‘‘నా పేరు జాన్. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. ఏసు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇవిగో మీకు చేపలు తెచ్చా’’ అని అరిచారు. వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే ఆ తెగవారు ఆగ్రహం చెంది, దాడికి ప్రయత్నించడంతో ఎలాగోలా తప్పించుకొచ్చినట్లు ఆ రోజు రాత్రి జాన్ తన సాహసాల గురించి కాగితాలపై రాశారు. 16న జాన్ మరోసారి దీవి వద్దకు వచ్చి ఆదిమవాసుల చేతిలో ప్రాణాలు కోల్పోయినట్లు ఈ కథనం వినిపిస్తుంది.
జాన్ చివరి సందేశం
జాన్ అండమాన్, నికోబార్ దీవులకు వెళ్లడానికి ముందు నవంబర్ 16న తన కుటుంబాన్ని ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో చివరి సందేశాన్ని పెట్టాడు. ‘మీ అందరికీ నేను పిచ్చివాడినని అనిపించొచ్చు. కానీ అండమాన్‌లోని సెంటినెలీస్ తెగకు చెందినవారికి జీసస్ గురించి బోధించడానికి ఇదే సరైన సమయం. దేవుడా.. నాకు చనిపోవాలని లేదు. ‘‘ఒకవేళ వారు నన్ను చంపేస్తే వారి మీద కోపగించుకోవద్దు’’. అని పోస్ట్ లో పేర్కొన్నాడు.
మరోవైపు జాన్ కుటుంబం కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. జాన్ క్రైస్తవ బోధకుడు, మారుమూల ప్రాంతాల్లో వైద్యసాయం అందించే సహాయకుడు, అంతర్జాతీయ సాకర్ కోచ్, పర్వతారోహకుడు కూడా. సెంటినెలీస్ తెగవారిపై ప్రేమ తప్పించి వేరే భావమేదీ అతడికి లేదు. జాన్‌ను చంపినవారిని క్షమిస్తున్నాం. జాన్‌కు సాయపడ్డ మత్స్యకారులను విడిచిపెట్టాలని కోరింది.
కేసు నిలుస్తుందా..
అంతకుముందే ఐదు సార్లు అండమాన్, నికోబార్ దీవులను సందర్శించిన జాన్ నవంబర్ 14న విఫలయత్నం చేశాడని అండమాన్ డీజీపీ దీపేంద్ర పాఠక్ చెప్పారు. పోర్ట్‌బ్లెయిర్ లోని హంఫ్రీగంజ్ పోలీసు స్టేషన్‌లో ఈ ఘటనలో గుర్తు తెలియని సెంటినెల్ దీవి వాసులు నిందితులుగా హత్య కేసు నమోదైంది. చెన్నైలోని అమెరికా కాన్సులేట్ ఆఫీసు కూడా దీనిపై ఓ కేసు పెట్టింది. అయితే వీరి ప్రాసిక్యూషన్‌కు అవకాశం లేదన్న వాదన ఉంది. మరోవైపు జాన్‌ను దీవి వరకూ తీసుకెళ్లిన ఏడుగురు మత్స్యకారులను పోలీసులు అరెస్టు చేశారు. జాన్ మిత్రుడు అలెక్స్ ను ప్రశ్నించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు తీరరక్షక దళం, గిరిజన సంక్షేమ, అటవీ శాఖల సిబ్బందితో కూడిన బృందం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ దొరకలేదు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ, అండమాన్, నికోబార్ పాలనా యంత్రాంగం నుంచి జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎస్టీ కమిషన్) నివేదికలను కోరింది.
2006 లోనే అనుభవమైందిగా..
2006లో ఇద్దరు మత్య్సకారులు ఉత్తర సెంటినెలీస్ దీవికి సమీపంలో పడవకు లంగరు వేసి నిద్రపోయారు. లంగరు ఊడిపోవడంతో ఆ పడవ దీవి తీరానికి కొట్టుకుపోయింది. అక్కడే వారు మత్య్సకారులను చంపేశారు. ఇసుకలో పాతి పెట్టారు. వీరి వద్ద విల్లంబులుంటాయి. దగ్గరికి రావడానికి ఎవరైనా ప్రయత్నిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తారు.
2006లో ఇద్దరు మత్య్సకారుల మృతదేహాలను వెలికి తీయడానికి వెళ్లిన కోస్ట్‌గార్డ్ కమాండెంట్ ప్రవీణ్ గౌర్ అప్పటి తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ‘‘వారు కేవలం 200 మీటర్ల దూరంలోనే ఉన్నారు. బాణాలతో మా హెలికాప్టర్ పై దాడి చేశారు. వారి నుంచి తృటిలో తప్పించుకున్నాం. ఏమైనా జరగని అని హెలికాప్టర్ ను దించి మృతదేహాలను వెతకాలని చూశాం. మేము కిందకు దిగేకొద్దీ వారు బాణాలతో విరుచుకుపడ్డారు. బాణాలు దాదాపు 100 మీటర్ల పై వరకు వస్తున్నాయి. వారి దృష్టి మరల్చితే కానీ సాధ్యం కాదు అని అర్థమైంది. హెలికాప్టర్ ను 1.5 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాం. వారూ మమ్మల్ని వెంబడించారు. మేము తిరిగి వేగంగా బోటు వద్దకు చేరుకున్నాం. అప్పటికీ వారు రాలేకపోయారు కాబట్టి దిగి ఒక మృతదేహాన్ని తీసుకురాగలిగాం. అంతలోపే వారు రావడంతో వెనుదిరగాల్సి వచ్చింది. వారు ఒకసారి చేసిన తప్పును మళ్లీ చేయరు. ఈ సారి ఒక గ్రూప్ బోటు దగ్గర ఉంది. మరో గ్రూప్ మమ్మల్ని వెంటాడుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో వెనుదిరిగాం అని ప్రవీణ్ గౌర్ తెలిపారు. ఈ సంఘటనతో పాటు సముంద్రంలో మరో ఇద్దరు మత్స్యకారులను కాపాడినందుకు గాను ప్రవీణ్ కు 2006లో తాత్రక్షక్ అవార్డు వచ్చింది.