Drone Didi Scheme: కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాలా సందర్భాల్లో చెప్పారు. వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెంచే చర్యలు తీసుకున్నామని, తద్వారా అనేక విభాగాలకు నాయకత్వం వహించే స్థాయికి అతివలు చేరుకున్నారని తెలిపారు.
అయితే వ్యవసాయంలో కూడా మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు గత ఏడాది ఆగస్టు 15న నమో డ్రోన్ దీదీ స్కీమ్‌ను(Namo drone didi scheme) ప్రారంభించారు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల మహిళలకు డ్రోన్లను అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించడం ఈ స్కీమ్ ఉద్దేశం.
ఫిబ్రవరి 25న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ 110వ ఎపిసోడ్లో ప్రధాని మోదీ మహిళాభివృద్ధి గురించి మాట్లాడారు. దేశ అభివృద్ధి పథంలో సహకారం అందిస్తున్న మహిళలను గౌరవించేందుకు రాబోయే మహిళా దినోత్సవం (మార్చి 8) మంచి సందర్భమని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన ‘డ్రోన్ దీదీ’ సునీతా దేవి గురించి ప్రధాని మాట్లాడారు.
* డ్రోన్ దీదీలు
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వ్యవసాయానికి డ్రోన్లను ఉపయోగిస్తారని కొన్నేళ్ల క్రితం వరకు ఎవరూ ఊహించలేదని, కానీ దీన్ని నిజం చేసి చూపిస్తున్నారని మోదీ చెప్పారు. సాధారణ గ్రామీణ మహిళ సునీతా దేవి డ్రోన్‌తో వ్యవసాయం చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నట్లు తెలిపారు. వీరిని అందరూ డ్రోన్ దీదీలుగా పిలుస్తున్నట్లు వివరించారు. అయితే మహిళలకు డ్రోన్లను అందించడానికి కొత్త స్కీమ్‌ను ప్రధాని గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగంలో ప్రకటించారు. అదే నమో దీదీ డ్రోన్ స్కీమ్. డ్రోన్లతో వ్యవసాయం చేసే మహిళా శక్తిని ప్రధాని డ్రోన్ దీదీలుగా పేర్కొన్నారు.
* బడ్జెట్లో రూ.500 కోట్లు
మన దేశంలో దాదాపు 70 శాతం కుటుంబాలు తమ జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి. ఈ రంగంలో గ్రామీణ మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించడం, వ్యవసాయ పద్ధతులను సమూలంగా మార్చడం నమో డ్రోన్ దీదీ స్కీమ్ ప్రాథమిక లక్ష్యం. కూలీల ఖర్చులను తగ్గించడం, ఎరువులు, సమయం, నీటిని ఆదా చేయడం, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సాధికారత కల్పించడం ఈ పథకం ఉద్దేశాలు.
స్వయం సహాయక బృందాలకు (SHGs) చెందిన 15,000 మంది మహిళలకు డ్రోన్ టెక్నాలజీనీ పరిచయం చేయాలని ఈ స్కీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. డ్రోన్ టెక్నాలజీతో ఈ మహిళలు వ్యవసాయ పద్ధతులను మెరుగుపర్చుకొని మొత్తం ఉత్పాదకతను పెంచవచ్చు. తాజా మధ్యంతర బడ్జెట్లో డ్రోన్ దీదీ పథకానికి రూ. 500 కోట్ల నిధులు కేటాయించారు. అంతకు ముందు ఏడాది రూ.200 కోట్లు కేటాయించగా, ఈసారి పెంచారు. దీంతో ఈ స్కీమ్‌కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
* పథకం లాభాలు
ఈ పథకం మహిళా స్వయం సహాయక సంఘాలకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. డ్రోన్ కొనుగోలుపై కేంద్రం సబ్సిడీని అందిస్తుంది. మహిళా స్వయం సహాయక సంఘాలు డ్రోన్ ధరలో 80 శాతం లేదా గరిష్టంగా రూ. 8 లక్షలు.. ఏది తక్కువైతే అంత మొత్తం సబ్సిడీకి అర్హులు. మిగిలిన డ్రోన్ ఖర్చుకు అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్టక్చర్ ఫండ్ (AIF) ద్వారా లోన్ తీసుకోవచ్చు. AIF ద్వారా పొందిన వడ్డీపై 3 శాతం నామమాత్రపు వడ్డీ ఉంటుంది.
డ్రోన్లను ఆపరేట్ చేయడానికి మహిళా స్వయం సహాయక సంఘాలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీరు తమ కమ్యూనిటీలలోని రైతులకు డ్రోన్లను అద్దెకు ఇవ్వొచ్చు. తద్వారా ఆర్థిక స్థిరత్వం, సాధికారత పెంపొందించుకుంటూ సంవత్సరానికి రూ. 1 లక్ష అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.
* ఈ స్కీమ్‌కు ఎవరు అర్హులు?
మహిళా స్వయం సహాయక సంఘాలు మాత్రమే నమో డ్రోన్ దీదీ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్కీమ్ ద్వారా పొందిన డ్రోన్లను వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి. దరఖాస్తు చేసుకోవడానికి మహిళా SHGల రిజిస్ట్రేషన్ నంబర్, మహిళా సభ్యుల ఆధార్ కార్డ్, మహిళా SHGల బ్యాంక్ ఖాతా వివరాలు, మొబైల్ నంబర్.. వంటివి అవసరం.
* ఎలా దరఖాస్తు చేయాలి?
– ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా కమిటీలు, నమో డ్రోన్ దీదీ పథకం కింద అర్హులైన మహిళా SGHలను ఎంపిక చేసి షార్ట్‌లిస్ట్ చేస్తాయి. అయితే రిజిస్టర్ అయిన మహిళా SHGలు మాత్రమే ఈ స్కీమ్ కింద ప్రయోజనాలను పొందేందుకు అర్హులు.
– జిల్లా కమిటీలు సంబంధిత మహిళల ఆర్థిక స్థితి, సామాజిక పనితీరు ఆధారంగా గ్రూపులను ఎంపిక చేస్తాయి. ఎంపిక అయిన గ్రూపు వివరాలను సంబంధిత SHGల లీడర్లకు తెలియజేస్తారు.
– నమో డ్రోన్ దీదీ పథకం కింద ఎంపిక చేసిన SHGలలోని మహిళా సభ్యులందరికీ డ్రోన్ ఆపరేషన్, టెక్నాలజీపై శిక్షణ ఇస్తారు. లబ్ధిదారులైన మహిళలు సమీపంలోని ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని లేదా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించి నమో డ్రోన్ దీదీ పథకానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
* ట్రైనింగ్
నమో డ్రోన్ దీదీ పథకం కింద, మహిళలకు డ్రోన్ టెక్నాలజీ, వ్యవసాయంలో దాని వినియోగానికి సంబంధించిన వివిధ అంశాలను కవర్ చేస్తూ సమగ్ర శిక్షణ అందిస్తారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో అనేక అంశాలు ఉంటాయి. డ్రోన్ పైలటింగ్‌లో భాగంగా డ్రోన్లను టేకాఫ్, ల్యాండింగ్ చేయడం, నావిగేషన్ స్కిల్స్, బ్యాటరీ నిర్వహణ వంటివన్నీ నేర్పిస్తారు. పంటల పర్యవేక్షణ, పురుగుమందులు, ఎరువులు చల్లడం, విత్తనాలు విత్తడానికి డ్రోన్లను ఎలా ఉపయోగించాలో ట్రైనింగ్ ఇస్తారు. డ్రోన్ల వాడకం పెరిగితే, డ్రోన్ స్టార్టప్స్, డ్రోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పెరుగుతాయి. తద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగి ఎక్కువ మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది.