Baptla : బాలికపై సామూహిక అత్యాచారం

బాపట్ల జిల్లాలో ఓ బాలికపై ఐదుగురు సామూహిక అత్యా చారానికి పాల్పడ్డారు. నిందితులను అరెస్ట్‌ చేశామని రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాపట్ల జిల్లా వేమూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక నిజాంపట్నం మండలంలోని ఓ గ్రామంలో ఉంటున్న మేనమామ ఇంటికి వచ్చింది.


బాలికకు పరిచయం ఉన్న చైతన్య అనే వ్యక్తి ఆమెకు శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఫోన్‌ చేసి బయటకు రావాలని కోరాడు. చైతన్య, అతని మిత్రుడు ఆమెను బైక్‌పై నిజాంపట్నం మండలం గరువుపాలెం శివారులో పొదల్లోకి తీసుకుని వెళ్లారు. వీరితో పాటు చైతన్య మిత్రులు మరో ముగ్గురు కూడా బాలికపై అత్యాచారం చేశారని తెలిపారు.

నిజాంపట్నం మండలం అడవులదీవి పోలీ్‌సస్టేషన్‌లో బాలిక ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. శనివారం నగరం మండలం సజ్జావారిపాలెం గ్రామంలో ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. వీరిపై పోక్సో చట్టం, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించినట్టు వెల్లడించారు.