పోలీసుల అదుపులో భారతీరెడ్డి పీఏ!

షర్మిల, సునీతపై బండబూతులు


పోస్టు చేసిన వర్రా రవీంద్రారెడ్డి

టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనితపైనా

బాబు, పవన్‌.. వారి కుటుంబ

సభ్యులే అతడి టార్గెట్‌

రెండేళ్లుగా నీచభాషలో పోస్టులు

పోలీసులకు ఫిర్యాదుచేసినా బుట్టదాఖలు

హోం మంత్రి అయ్యాక అనిత వార్నింగ్‌

దీంతో పులివెందుల-కదిరి మధ్య

రవీంద్రారెడ్డిని పట్టుకున్న పోలీసులు

సోషల్‌ మీడియాలో వైసీపీ ప్రచారం

అమరావతి, జూన్‌ 21 : మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్‌ భారతీరెడ్డి అండతో గత ఐదేళ్లుగా సోషల్‌ మీడియాలో చెలరేగిపోయిన ఆమె వ్యక్తిగత సహాయకుడు వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ, జనసేన అధినేతలు, మహిళా నాయకులతో పాటు.. జగన్‌తో విభేదించిన పాపానికి ఆయన చెల్లెళ్లు షర్మిలారెడ్డి, వివేకానందరెడ్డి కుమార్తె సునీతలపైనా ఇతడు దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడు. సభ్యత ఉన్నవారెవరూ చదవడానికి వీల్లేని భాషలో అతడి పోస్టులు ఉండేవి. షర్మిలపై చండాలపు పోస్టులు పెట్టిన రవీంద్రారెడ్డిని పులివెందులలో వైఎ్‌సఆర్‌ అభిమానులు తన్నేందుకు సిద్ధమయ్యారు. భయపడి అబ్బే అదంతా మార్ఫింగ్‌ అంటూ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసి డ్రామాకు తెర తీశాడు. అతడి నీచ భాషను సహించలేక వివేకా కుమార్తె సునీత హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. చాలా వరకూ మహిళా నేతలనే రవీంద్రారెడ్డి టార్గెట్‌ చేశాడు. టీడీపీ మహిళావిభాగం అధ్యక్షురాలు (ప్రస్తుత హోం మంత్రి) వంగలపూడి అనిత, టీడీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ ఉండవల్లి అనూషపై అనుచిత వ్యాఖ్యలతో హల్‌చల్‌ చేశాడు.

జగనన్న సేవకుడినని గర్వంగా చెప్పుకొనే రవీంద్రారెడ్డి గత రెండేళ్లలో లెక్కలేనన్ని అసభ్య పోస్టులు పెట్టాడు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, వారి కుటుంబ సభ్యులు, టీడీపీలోని మహిళా నేతలను దారుణంగా ట్రోల్‌ చేశాడు. ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఒక జనసేన బీసీ నాయకురాలిపై నీచమైన వ్యాఖ్యలు చేశాడు. వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. వారు వాటన్నిటినీ బుట్టదాఖలు చేశారు. అనితకు అక్రమ సంబంధాలు ఉన్నాయని.. ఇతర తెలుగు మహిళలు వ్యభిచారులంటూ రవీంద్రారెడ్డి పోస్టులు పెట్టాడు. భరించలేని అనిత అప్పట్లో సీరియ్‌సగా వార్నింగ్‌ ఇచ్చారు. ‘రవీంద్రారెడ్డీ.. ఇప్పుడు నువ్వు పులివెందులలో దాక్కోవచ్చు. టైమ్‌ ఎప్పుడూ ఒకేలా ఉండదు.. రేపంటూ ఒకటి ఉంటుంది.. నీ పాపాలకు వడ్డీ మీద వడ్డీ చెల్లిస్తాం’ అని హెచ్చరించారు. అనిత హోం మంత్రి అయిన వెంటనే విలేకరుల సమావేశంలో రవీంద్రారెడ్డిపై విరుచుకు పడ్డారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నాడు పులివెందుల-కదిరి మధ్యలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని వైసీపీ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తోంది.