AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ.. పలు పాత స్కీమ్‌లకు సంబంధించిన లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా నగదు జమ చేయాల్సిన వ్యవహారం ఇప్పుడు కాకరేపుతోంది.. అయితే, డీబీటీ పథకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఇచ్చిన వివరణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.. జనవరి-మార్చి మధ్య కాలంలో ఏపీ ఆర్ధిక పరిస్థితి బాగానే ఉందని సీఎస్ చెప్పారు.. లబ్ధిదారులకు ఆ నిధులు అందుబాటులో ఉంచలేదు. బ్యాంకు ఖాతాలకు జమ చేయాల్సినప్పుడు కాకుండా దాన్ని దీర్ఘకాలం పెండింగులో ఉంచారని పేర్కొంది.. అయితే, గత ట్రాక్ రికార్డ్ చూసినా మే నెలలో ఎప్పుడూ డీబీటీ పథకాలకు నిధులు జమ చేయలేదన్న ఎన్నికల కమిషన్.. పోలింగ్ తేదీ కంటే ముందుగా లబ్దిదారుల ఖాతాలకు నిధులను జమ చేయాల్సినంత అత్యవసర పరిస్థితులు ఏమీ లేవు అని స్పష్టం చేసింది.. అయితే, పోలింగ్ తేదీ తర్వాత ఎప్పుడైనా ఆరు పథకాలకు సంబంధించిన నిధులు లబ్దిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేసేందుకు అభ్యంతరం లేదని పేర్కొంది కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ).
కాగా, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఎన్నికల కమిషన్ లేఖ రాసిన విషయం విదితమే.. సంక్షేమ పథకాలకు నిధులు విడుదలపై వివిధ ప్రశ్నలు లేవనేత్తుతూ ఈసీఐ లేఖ రాసింది. జనవరి 2024 నుంచి మార్చి 2024 వరకు డీబీటీలకు నిధులెందుకు ఇవ్వలేదు?.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏంటో చెప్పండి?.. ఇప్పటి వరకు జమ చేయలేని ప్రభుత్వానికి ఇప్పుడు ఒక్కసారిగా నిధులెలా సర్దుబాటు అయ్యాయి?.. ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నం ఎన్నికల పోలింగ్ తేదీకి దగ్గరగా డబ్బులు పంపిణీ కాదని ఎలా చెపుతారు? అంటూ ప్రశ్నించింది. ఇలా సొమ్ములు పంపిణీ చేయడం వల్ల ఇతర అభ్యర్థులకు అన్యాయం జరగదా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతినదా? అని లేఖలో అడిగింది. గత ఐదేళ్లగా సంక్షేమ పథకాలకు నిధులు బటన్ నొక్కిన నాటి నుంచి ఎన్ని రోజుల్లో పడ్డాయి ఆ వివరాలు ఇవ్వండి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏపీ సీఎస్ ను అడిగింది. ఇప్పుడు మాత్రమే నిధుల జమ ఎందుకు ఆలస్యమైంది?.. పోలింగ్ తేదీకి దగ్గరగా ఈ సొమ్ములు ఎందుకు వేయాలనుకుంటున్నారు?.. ఈరోజే లబ్ధిదారులకు సొమ్ము చెల్లించకపోతే జరిగే ప్రమాదం ఏంటీ?.. సంక్షేమ పథకాలు నిధులు ఇస్తామని చెప్పి వారాలు, నెలలు గడిచిపోయాయి.. ఏప్రిల్, మే నెలలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని ముందుగా తెలియదా? అని లేఖలో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక, వీటిపై ఈసీకి సీఎస్ వివరణ ఇవ్వడంతో మరోసారి స్పందిస్తూ.. పోలింగ్ తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తే తమకు అభ్యంతరం లేదని పేర్కొంది కేంద్ర ఎన్నికల సంఘం.