వాలంటీర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. !

ఏపీలో వైసీపీ హయాంలో నియమించిన రెండున్నర లక్షలకు పైగా వాలంటీర్ల సేవల కొనసాగింపుపై కూటమి ప్రభుత్వం ఇవాళ ఓ స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే వైసీపీ అధికారం కోల్పోయాక డైలమాలో ఉన్న వాలంటీర్ల సేవల కొనసాగింపుపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రులు చెప్తూ వచ్చారు.


అయితే ఇవాళ నేరుగా సీఎం చంద్రబాబే పెన్షన్ల పంపిణీ సందర్భంగా దీనిపై క్లారిటీ ఇచ్చారు.

ఏపీలో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకే వాలంటీర్లకు బదులుగా సచివాలయ సిబ్బంది, టీడీపీ నేతలు దగ్గరుండి మరీ పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. ఇవాళ సాయంత్రానికి వీలైతే 100 శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చేసేయాలని ప్రభుత్వం టార్గెట్ కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో స్వయంగా పెనుమాకలో లబ్దిదారుల ఇంటికెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు అనంతరం నిర్వహించిన బహిరంగసభలో వాలంటీర్లపై స్పందించారు.

వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో ఏప్రిల్, మే నెలల్లో అప్పటి వైసీపీ సర్కార్.. 33 మంది లబ్దిదారులు చనిపోయే పరిస్థితిని తెచ్చిందని చంద్రబాబు గుర్తుచేశారు. అప్పట్లో తాము సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించాలని కోరినా వారు అలా చేయలేదన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక సచివాలయ సిబ్బందితో ఎందుకు పెన్షన్ల పంపిణీ జరగదో చేసి చూపించాలనే పట్టుదలతో ఇవాళ ఒకే రోజు వారితో పంపిణీ చేయిస్తున్నామన్నారు. అంతే కాదు సచివాలయ సిబ్బందితో పాటు అవసరమైతే వాలంటీర్ల సహాయం తీసుకోవాలని చెప్పామన్నారు. తద్వారా సచివాలయ సిబ్బందికి తోడుగా వాలంటీర్లను కూడా వాడుకుంటున్నట్లు స్పష్టం చేశారు.