ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్ వినిపించిన చంద్రబాబు

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నారా చంద్రబాబునాయుడు పాలనపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు.


తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యను సత్వరమే పరిష్కరించారు. మామిడి ధరలు పతనం కావడంతో ఈ విషయాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులకు టన్నుకు రూ.30వేల ధర నిర్ణయించారు.

టన్ను మామిడికి రూ.30వేలు

ప్రస్తుతం ఎకరాకు రూ.19వేల నుంచి రూ.21వేల మధ్యలో ధర ఉంది. వేసవికాలంలో వీచిన ఈదురు గాలులకు, కురిసిన వర్షాలకు మామిడి నేలరాలింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సాగయ్యే మామిడిలో 90 శాతం తోతాపురి ఉంటుంది. వెంటనే వీరికి టన్నుకు రూ.30వేలు ఇచ్చేలా చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. పల్ప్ కంపెనీలు, వ్యాపారస్తులు, మామిడికాయ మండీల యాజమాన్యం ఈ ధర చెల్లించాలని, అంతకన్నా తక్కువ చెల్లిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెంచిన ధరలు ఇస్తున్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాలని, దీనిపై తనకు అప్‌డేట్ ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు.

యాజమాన్యం అడ్డుకుంటోంది

తాజాగా ఈ విషయాన్ని పులివర్తి నాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమలకు చెందిన యాజమాన్యం, మామిడి ర్యాంపు యజమానులు, మామిడికాయ మండీల యాజమాన్యం సిండికేట్ గా ఏర్పడి రైతులకు గిట్టుబాటు ధర రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. టన్నుకు రూ.30వేలు నిర్ణయించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తోతాపురి రకం సాధారణ స్థితిలో ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడినిస్తుంది. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో దిగుబడి తగ్గింది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం ఒక కంపెనీ మాత్రం టన్నుకు రూ.23వేలు చెల్లిస్తోంది.