Jasprit Bumrah: ఆపద్బాంధవుడు బుమ్రా

జట్టు కష్టాల్లో పడిందా.. ఓటమి కోరల్లో చిక్కుకుందా? అయితే అతనికి బంతి అందించాల్సిందే. ప్రత్యర్థి బ్యాటర్లు చెలరేగుతున్నారా? మ్యాచ్‌ చేజారే పరిస్థితి వచ్చిందా? అయితే అతను బౌలింగ్‌కు రావాల్సిందే.


జట్టు కష్టాల్లో పడిందా.. ఓటమి కోరల్లో చిక్కుకుందా? అయితే అతనికి బంతి అందించాల్సిందే. ప్రత్యర్థి బ్యాటర్లు చెలరేగుతున్నారా? మ్యాచ్‌ చేజారే పరిస్థితి వచ్చిందా? అయితే అతను బౌలింగ్‌కు రావాల్సిందే. అసాధ్యమనుకున్న దాన్ని అందుకోవాలన్నా.. పరాజయాన్ని దాటి విజయాన్ని చేరుకోవాలన్నా.. అతను బంతితో సత్తాచాటాల్సిందే. అతనే టీమ్‌ఇండియా ఆపద్బాంధవుడు జస్‌ప్రీత్‌ బుమ్రా. ప్రపంచంలోనే మేటి పేసర్లలో ఒకడు.

బుమ్రా తన కంటే వెయ్యి రెట్లు నయం అని దిగ్గజం కపిల్‌ దేవ్‌ అన్నాడంటేనే అతని సామర్థ్యాలను అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోని మేటి క్రికెటర్లంతా అహో బుమ్రా అని పొగుడుతున్నారంటేనే అతని బౌలింగ్‌ ఎంతటి అద్భుతమో తెలుస్తోంది. ఇప్పుడు ఐసీసీ టైటిళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారత్‌ ముగింపు పలకడంలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ బుమ్రాది కీలక పాత్ర. కేవలం వికెట్లు తీయడమే కాదు పరుగులు కట్టడి చేసి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టడం అతనికి బంతితో పెట్టిన విద్య. ఆఫ్‌స్టంప్‌కు కాస్త ఆవల బంతి వేసి దాన్ని రివ్వుమని లోపలికి స్వింగ్‌ చేసి బ్యాటర్లకు అందకుండా బుమ్రా స్టంప్స్‌ను లేపేస్తుంటే చూడ్డానికి రెండు కళ్లు చాలవు. ఇక పరిస్థితులకు తగ్గట్లుగా, బ్యాటర్ల బలహీనతను బట్టి షార్ట్‌పిచ్‌ బంతులు, యార్కర్లు వేయడంలో బుమ్రా సిద్ధహస్తుడు. ఈ టోర్నీలో 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లతో అతను సత్తాచాటాడు. అతని సగటు 8.26 మాత్రమే. ఎకానమీ 4.17. పాకిస్థాన్‌పై 3, అఫ్గానిస్థాన్‌పై 3, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాపై రెండేసి వికెట్లతో అదరగొట్టాడు. ముఖ్యంగా తుదిపోరులో ఓటమి దిశగా సాగుతున్న జట్టును 18 ఓవర్లో రెండు పరుగులే ఇచ్చి, ఓ వికెట్‌ తీసి బుమ్రా గెలుపు వైపు మళ్లించాడు.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.