అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

ఈతకు వెళ్లిన సమయంలో ప్రమాదం


కల్లూరు రూరల్‌: ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి శ్రీనాథరాజు కిరణ్‌ (20) శనివారం అమెరికాలో మృతి చెందాడు. కల్లూరు మండలంలోని చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్‌ అమెరికాలో మిస్సోరీ స్టేట్‌లో ఉన్న శ్యాండిల్‌ ఎస్‌ టౌన్‌లో ఉంటూ ఎంఎస్‌ చదువుతున్నాడు.

గతేడాది నవంబర్‌లో అమెరికా వెళ్లిన కిరణ్‌ తాను నివసిస్తున్న ప్రదేశానికి సమీపంలో ఈత కొట్టేందుకు ముగ్గురు మిత్రులతో కలిసి వెళ్లాడు.

అయితే, ఈతకొలను ఎనిమిది అడుగుల మేర ఉండగా అందరూ దిగడంతో కిరణ్‌కు ఈత రాక నీళ్లలో మునిగిపోయాడు. మిగిలిన మిత్రులకు కూడా ఈత రాకపోవడంతో నీట మునుగుతున్న కిరణ్‌ను చూస్తూ నిస్సహాయులుగా మిగిలిపోయారని తెలుస్తోంది. కాగా, కిరణ్‌ తండ్రి లక్ష్మణ్‌రాజు గతంలోనే చనిపోగా తల్లి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది. వీరి బాధ్యతలను కిరణ్‌ తాత కృష్ణమూర్తిరాజు చూస్తున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కిరణ్‌ చనిపోయినట్లు సమాచారం అందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.