మంకీపాక్స్ విజృంభణతో రాష్ట్ర సర్కార్ అలర్ట్.. వైరస్ లక్షణాలు ఇవే

www.mannamweb.com


ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న మరో మహమ్మారి.. దీన్ని మహమ్మారి అనొచ్చా..? లేక మామూలు వ్యాధిగానే పరిగణించాలా అనే స్పష్టతైతే లేదు. ఇది విజృంభించే పరిస్థితులున్నాయా లేదా అనే సందేహాలు కూడా లేకపోలేదు.

ప్రస్తుతానికి ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్ని కబళిస్తోంది మంకీపాక్స్. భారత్‌లో ఈ వైరస్‌ ప్రభావితం చేసేంత సత్తా దీనికి ఉందా లేదా..? అన్నదీ ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య యంత్రాంగం అప్రమత్తమైంది.

మంకీపాక్స్… ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో మొదటిసారిగా కనిపించింది. తర్వాత యూరోపియన్ దేశాలకు పాకింది. పాకిస్తాన్‌లో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. మార్చి మూడో వారంలో మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆరు నెలల గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు ఇండియాని వణికిస్తోంది. మంకీపాక్స్ లక్షణాల్ని, దాంతో కలిగే డ్యామేజ్‌నీ బట్టి కోవిడ్‌తో పోలిక పెట్టడం అలవాటుగా మారింది. కానీ.. కరోనా అంతటి ప్రమాదకరం కాదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

భారత్‌లోకి మహమ్మారి

ఇటీవలే హర్యానాలో ఒక యువకుడికి లక్షణాలుంటే మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఢిల్లీలో మరో ఇద్దరికి మంకీపాక్స్ సంకేతాలున్నట్టు గ్రహించి.. వీళ్లను ఐసొలేషన్‌లో ఉంచారు. పరీక్షల తర్వాత ఇది వెస్ట్-ఆఫ్రికన్ క్లేడ్‌-2 మంకీపాక్స్ వైరస్‌గా గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించిన క్లేడ్‌-1 రకం వైరస్‌ కాదు కనుక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. పైగా క్లేడ్ -2 వైరస్ కొత్త రకం వేరియంట్ కాదు. గత రెండేళ్లలో దేశంలో ఇటువంటివి 30 దాకా నమోదయ్యాయి. ఇప్పుడు వైరస్ సోకిన వాళ్లు విదేశాలకు వెళ్లి అక్కడే మంకీపాక్స్ సోకిన తర్వాత భారత్‌కు వచ్చారు. వేగంగా వ్యాప్తి చెందే వైరస్ కానప్పటికీ.. ఛాన్స్ ఇవ్వొద్దనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. మంకీపాక్స్ కేసులు పెరగకుండా రాష్ట్రాలను అలర్ట్ చేసింది.

ఈ నేపథ్యంలోనే మంకీ పాక్స్ అలర్ట్‌తో విశాఖలో అప్రమత్తమయ్యారు వైద్యాధికారులు. విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రత్యేక మెడికల్ టీం ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ పాసింజర్లపై ప్రత్యేక నిఘా పెంచారు. ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లను పరిశీలించారు DMHO డాక్టర్ జగదీశ్వర్ రావు. అంతేకాకుండా కింగ్ జార్జ్ ఆసుపత్రి, చెస్ట్ ఆసుపత్రిలోనూ ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు చేశారు .

ఎయిర్‌పోర్టులో స్క్రీన్ సెంటర్

మంకీపాక్స్ పై విశాఖ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కేంద్రం రాష్ట్రాల సూచనలతో.. ప్రత్యేక వైద్యుల కమిటీని నియమించారు. మంకీపాక్స్ పై ముందు జాగ్రత్త చర్యగా అప్రమత్తమయ్యామన్నారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగదీశ్వర్ రావు. ఎయిర్‌పోర్టులో హెల్త్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సర్వేలెన్సు ఆఫీసర్ తో కూడిన వైద్య బృందాన్ని నియమించామన్నారు. గతంలో ఎయిర్ పోర్ట్ లో కోవిడ్ సమయంలో పనిచేసిన సిబ్బందిని టీం లో చేర్చి పర్యవేక్షిస్తున్నారు. స్క్రీ్నింగ్ చేసి.. సస్పెక్ట్ ఉంటే ఆసుపత్రికి తరలించి ఐసోలేట్ చేస్తున్నారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారి ట్రావెల్ హిస్టరీని చెక్ చేస్తున్నారు. విశాఖలో చెస్ట్ ఆసుపత్రి కేజీహెచ్ లో ప్రత్యేక బెడ్స్ సిద్ధం చేశామని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు తెలిపారు.

KGH లో స్పెషల్ వార్డు..

ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయినిగా ఉన్న కింగ్ జార్జ్ ఆసుపత్రిలో వైద్యులు అలర్ట్ అయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ సూచనతో.. ముగ్గురు వైద్య నిపుణులతో కమిటీని నియమించారు. వారిలో డెర్మటాలజీ విభాగాతిపతి శాంతి, జనరల్ మెడిసిన్ విభాగ్యాతిపతి డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ సునీల్ కుమార్ బోర్డు మెంబర్ కు సభ్యులుగా ఉన్నారు. కేజీహెచ్ లో ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశామని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద తెలిపారు.

లక్షణాలు ఇలా ఉంటే..

ఈ ఏడాది ఆఫ్రికాలో పద్దెనిమిది వేలకుపైగా మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. పాకిస్తాన్‌లోనూ మంకీపాక్స్‌ కేసులు వెలుగుచూశాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. మంకీపాక్స్​ వైరస్‌ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 21 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడవచ్చు. జ్వరం, శరీరంపై పొక్కులు, గొంతు ఎండిపోవడం, తల, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ వంటివి సాధారణంగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు దాదాపు రెండు నుంచి నుంచి నాలుగు వారాలపాటు కొనసాగవచ్చు. ఇది ఆ వ్యక్తి రోగ నిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది. కొంతమందిలో మరికొన్ని లక్షణాలు కనిపించవచ్చు. నోరు, కళ్లు, గొంతు, ప్రైవేట్ భాగాలపై పొక్కులు రావొచ్చు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని.. అపోహలతో కంగారు పడొద్దు అని అంటున్నారు వైద్యులు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

అప్రమత్తమైన వైద్యాధికారులు

ఎయిర్ పోర్ట్ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణంలో వస్తూపోతూ ఉంటారు. నాలుగు ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీస్ లతో.. 30 వరకు విమానాలు నడుస్తూ ఉంటాయి. దీంతోపాటు.. కేజీహెచ్ కు నిత్యం రోగుల తాకడి విపరీతంగా ఉంటుంది. వేర్వేరు డిసీజెస్ తో రాష్ట్రాల నుంచి కూడా కేజీహెచ్ కు వస్తూ ఉంటారు రోగులు. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తమయ్యారు వైద్యాధికారులు. కోవిడ్ ని సమర్థంగా ఎదుర్కొన్న.. వైద్య బృందం ఇప్పుడు ఈ మంకీ పాక్స్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రజలు మాత్రం ఆ ప్రమాదంగా ఉండాలి. స్వీయ రక్షణ పాటించాలన్నది వైద్యాధికారులు, వైద్యుల సూచన.