దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. రాముడు, రావణాసురున్ని యుద్ధంలో ఓడించి అతని అహంకారాన్ని నాశనం చేశాడు. ఆ రోజును విజయదశమిగా జరుపుకుంటారు. అయితే రావణాసుడిని దైవంగా బావించి పూజలు చేసేవారు ఉన్నారు. మధ్య ప్రదేశ్ ఛింద్వారా జిల్లా జమునియా గ్రామంలో నవరాత్రుల సందర్భంగా భక్తులు దుర్గామాత పూజలు చేస్తుంటే.. మరోవైపు గిరిజనులు రావణుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తున్నారు. ఇక్కడి గిరిజనులు రావణుడిని తమ ఆరాధ్య దైవంగా పూజిస్తుంటారు. వింటానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. పండల్‌లో రావణుడి విగ్రహానికి భక్తి శ్రద్దలతో పూజలు జరిపిస్తుంటారు గిరిజనులు. ఇది అనాధిగా వస్తున్న ఆచారం అని గిరిజనులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్య ప్రదేశ్ లోని జమునియా గ్రామం నగరానికి కేవలం 16 కిలో మీటర్ల దూరంలో ట్యాంకీ మొహల్లాలో ఈ ఆచారాలు కనిపిస్తుంటాయి. ఇక్కడి గిరిజనులు నవరాత్రుల సందర్భంగా ఓ వైపు దుర్గామాత అమ్మావారిని ప్రతిష్టించి పూజలు జరుపుతూనే మరో వైపు రావణుడి విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేస్తుంటారు. దుర్గామాత ప్రతిష్టాపన సమయంలో కలశాన్ని ఏర్పాటు చేసినట్లుగానే, గిరిజన తెగకు చెందిన ప్రజలు రావణుడి విగ్రహం ముందు ఐదు కలశాలను ప్రతిష్టించి 9 రోజుల పాటు పూజలు చేసిన వినాయక, దుర్గామాత విగ్రహాలు ఊరేగించిన నిమజ్జనం ఎలా చేస్తారో.. రావణుడి విగ్రహాన్ని కూడా అలాగే నిమజ్జనం చేస్తారు.
మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో సానగోల ఊళ్లో దశకంఠుడికి నిలువెత్తు రూపాన్ని తయారు చేసి ప్రజలు హారతులు పడతారు. మంగళ హారతులతో రావణాసురుడి విగ్రహం ముందు పూజలు చేస్తారు. ఊరి మధ్యలో నల్లరాయితో చేసిన పెద్ద రావణుడి విగ్రహం ఉంటుంది. ఆయన గొప్పతనాన్ని, దాన గుణాన్ని, తెలివితేటల గురించి పాటలు, భజన రూపంలో తెలియజేస్తుంటారు. 300 ఏళ్లుగా గ్రామస్థులు దసరా రోజున రావణుడికి పూజలు చేయడం ఆచారంగా వస్తుంది. ఆ వేడుక చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు. రావణాసురుని గొప్పతనాన్ని, శౌర్యాన్ని, దానగుణాన్ని వాల్మీకి మహర్షి అరణ్యకాండ 32వ సర్గలో వర్ణిస్తాడు. కేవలం సీతమ్మ పై వ్యామోహంతో రామాయణ ఇతిహాసంలో ఒక చెడ్డవాడిగా మిగిలిపోయాడు రావణాసూరుడు.